Aug 24,2023 20:34

నీటితో కళకళలాడుతున్న మడ్డువలస రిజర్వాయరు

ప్రజాశక్తి - వంగర :  మండలంలోని గొర్లె శ్రీరాములనాయుడు మడ్డువలస ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు ప్రధాన గేట్లు మరమ్మతులకు గురికావడంతో వాటిని బాగు చేసేందుకు ప్రాజెక్ట్‌ అధికారులు ప్రాజెక్టులో ఉన్న నీటినంతటిని ఇటీవల దిగువకు విడిచి పెట్టడంతో ప్రాజెక్టులో నీరు లేక బోసిపోయిన విషయం తెలిసిందే. దీంతో మడ్డువలస ప్రాజెక్టు దిగువ ఆయకట్టు రైతులు కూడా ఈ ఏడాది పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందో లేదో అని ఇంతవరకు అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అధికారులు కూడా ఆయకట్టుకు సాగునీరు అందించగలమా లేదా అని తలల పట్టుకున్న పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మండలంలో పెద్దగా వర్షాలు కురవకపోయినప్పటికీ ఎగువున కురుస్తున్న వర్షాలు కారణంగా సువర్ణముకి, వేగావతి నదుల నుంచి నీరు వచ్చి చేరడంతో మడ్డువలస ప్రాజెక్టు జలకలతో నీరు పుష్కలంగా నిండిపోవడంతో మడ్డవలస ప్రాజెక్ట్‌ దిగువ ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది ఉండదని తెలుసుకున్న రైతులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులో ప్రస్తుత నీటి పరిస్థితి..?
మండలంలోని గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస ప్రాజెక్టు 65 మీటర్లు లెవెల్‌ నీటిమట్టానికి గాను, ప్రాజెక్టులో ప్రస్తుతం 63.01 లెవెల్‌ నీటిమట్టం ఉందని ప్రాజెక్టు ఎఇలు నితిన్‌, అన్వేష్‌లు గురువారం తెలిపారు. సువర్ణముకి, వేగావతి నదుల నుంచి 1743 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. కుడి ఎడమ కాలువల ద్వారా 710 విడిచి పెడుతున్నట్లు తెలిపారు. పై అధికారి సూచన మేరకు ఒక ప్రధాన గేటు ద్వారా దిగివను ఉన్న నారాయణపురం ఆనకట్టుకు 200 క్యూ సెక్కల నీటిని విడిచి పెడుతున్నామన్నారు.