ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని కరకవలస పంచాయతీ పరిధిలో గల మారిక గిరిజన గ్రామం ఎనిమిది కిలోమీటర్లు దూరంలో మారిక కొండల మధ్య ఉంది. ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం సడక్ యోజన పథకం కింద రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరై సుమారు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా నిర్మాణ పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. గిరిజనులు పలుమార్లు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టు కున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టినప్పుడల్లా ఉత్తుత్తి హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప రోడ్డు నిర్మాణ పనులను మాత్రం పూర్తి చేయడం లేదు. దీంతోనే గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎంత చులకన భావనో ఇట్టే అర్థమవుతోంది. అత్యవసర సమయాల్లో వైద్య సేవలకు కొండ దిగి వచ్చేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే తప్ప వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. ఈ గ్రామంలో నివాసముంటున్న 250 కుటుం బాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా నడుచు కుంటూ కిందకు రావాల్సిందే తప్ప వాహనాలు వెళ్లే మార్గం లేక అవస్థలు పడు తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తవకపో వడంతో ఆ గ్రామం వెళ్లాల్సిన వేపాడ పిహెచ్‌సి సిబ్బంది కొండ వరకు వచ్చి అక్కడే ఆగిపోతున్నారు. కొండపైకి వెళ్లిన తరువాత వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని అక్కడే నిలబడి ఆలోచిస్తున్న దృష్యాన్ని ఈ ఫోటలో చూడొచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి రోడ్డు పూర్తిచేయాలని కోరుతున్నారు.










