Aug 30,2023 20:56

వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న యువత

ప్రజాశక్తి - కొత్తవలస : కొత్తవలస మేజర్‌ పంచాయతీ పరిధి శివారు గ్రామమైన పాత సుంకరపాలెం గ్రామ యువత ఆపదలో చిక్కుకున్న ఓ మహిళను అక్కున చేర్చుకున్నారు. విజయనగరం కలెక్టర్‌ ఆఫీస్‌ ఎదురుగా కనపాక తారకరామ కాలనీకి చెందిన సత్యవతి గత కొద్దిరోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి పాత సుంకరపాలెం అడవిలోకి వచ్చేసింది. గత నాలుగు రోజులుగా గేదెల కాపరులకు మేకల కాపరులకు కనిపిస్తున్నప్పటికీ ఈ చుట్టుపక్కల గ్రామానికి చెందిన వారై ఉంటారని అనుకున్నారు. మంగళవారం సాయంత్రం గేదెలు కళ్ళానికి రాకపోవడంతో రైతు కుమారుడు మరొక స్నేహితునితో కలిసి గేదలు వెతకడానికి వెళ్ళగా అడవిలో దిక్కు తోచని స్థితిలో ఆ వృద్ధురాలు కనిపించడంతో విషయాన్ని గ్రామ యువతకు తెలిపారు. హుటా హుటిన రాత్రి పది గంటల సమయంలో ఆటోలు, బైకులతో 30 మంది వరకు యువకులు అడవికి చేరుకుని, ఆ వృద్ధురాలను ఊరిలోకి తీసుకువచ్చి స్నానం చేయించి, భోజనం పెట్టి వివరాలు అడగగా విజయనగరం కలెక్టర్‌ ఆఫీస్‌ ఎదురుగా అని మిగతా వివరాలు చెప్పకపోవడంతో, విజయనగరం వన్‌ టౌన్‌ ఎస్‌ఐ మురళిని చరవాణిలో రాత్రి 11.30గంటల సమయంలో సంప్రదించారు. ఎంతో బాధ్యత తీసుకొని ఆ సమయంలో వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసి కుటుంబ సభ్యులకు తెలియజేసి కుటుంబ సభ్యులను యువతతో మాట్లాడించి రాత్రికి ఉంచండి తెల్లవారు వచ్చి తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పగా, మళ్లీ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమోనని అనుమానంతో యువత రాత్రంతా అక్కడే ఉండి బుధవారం ఉదయం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామస్తులందరూ యువకులను అభినందించారు. అర్ధరాత్రి సమయంలో సరైన సమాచారం అందించిన ఎస్‌ఐ మురళిని గ్రామస్తులం దరూ అభినందించారు.