ప్రజాశక్తి - విజయగరం ప్రతినిధి : జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు 'మాకు మీరు... మీకు మేము' అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాధనాన్ని, భూములను కారు చౌకగాను, ఒకింత సులభతరంగానూ చేజెక్కించు కునేందుకు అంతా ఒక్కటౌతున్నారు.' ఇదేదో వేరొక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు చేస్తున్న విమర్శలు కాదు సుమా...! నాయకుల వ్యవహారశైలి పై పెల్లుబుకుతున్న పబ్లిక్ టాక్. ఇందుకు ఎన్నో సందర్భాలను, రాజకీయ విన్యాసాలను ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో రూ.కోట్లు విలువ చేసే 30ఎకరాల భూమిని పరిశ్రమ పేరిట జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబీకుల పేరున రూ.10లక్షలకే కట్టబెట్టినట్టు వార్తలు వచ్చిన విషయం విధితమే. దీనిపై ప్రతిపక్షం స్పందించే తీరుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మొదటి రెండు రోజులపాటు టిడిపి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున, టిడిపి బొబ్బిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బేబినాయన కొంత హడావుడి చేసినప్పటికీ ఆ తరువాత మిన్నకుండిపోయారు. విమర్శలు మనహా మంత్రి కుటుంబీకులకు భూమి కేటాయింపుపై నిఖరమైన పోరాటం చేయలేదు. వీరి సంగతి కాసేపు పక్కనబెడితే.. పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులుగా, టిడిపిలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న పూసపాటి అశోక్‌గజపతిరాజు మాట వరసకు కూడా స్పందించలేదు. దీంతో, అశోక్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మాన్సాస్‌లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, వేల కోట్ల విలువ చేసే భూములు, భవనాలు, స్థలాలు, 13 విద్యాసంస్థలు ఉన్న ఆ ట్రస్ట్‌లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్టు లెక్కలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాన్సాస్ ట్రస్ట్ లెక్క తేలుస్తామంటూ వైసిపి అధికారంలోకి వచ్చిన కొత్త మంత్రి బొత్స హడావుడి చేసినప్పటికీ ఆ తరువాత మిన్నకుండి పోయారు. విజయసాయిరెడ్డి జరిపిన ఫ్లోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు కూడా బుట్టదాఖలైపోయింది. ఈ నేపథ్యంలో బొత్సపై అశోక్ అప్పుడప్పుడూ విమర్శలు చేస్తున్నప్పటికీ ఉదారతగానే వ్యవహిస్తారని చాలా మంది నోట వినిపిస్తున్నమాట. గతంలో సీతం కళాశాల స్థలంపై సిపిఎం ఆధ్వర్యాన పెద్దఎత్తున పోరాటం జరిగినప్పటికీ అశోక్ స్పందించలేదు. ఇంకోవైపు పార్టీలో అశోక్‌కు తానేమీ తీసిపోను అన్నట్టుగా వ్యవహరిస్తున్న కిమిడి కళావెంకటరావు కూడా బొత్సపై వచ్చిన ఆరోపణలపై స్పందించలేదు.అందరూ అంటున్నట్లుగా ఆయన కుమారుడిపేరున అప్పటి టిడిపి ప్రభుత్వం 10ఎకరాలు కట్టబెట్టిన తీరువల్లేనేమో అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు చేసిన ప్రకటనపైనా కళావెంకటరావునుంచి స్పందన లేదు. మరోవైపు ఎస్.కోట నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ సుమారు నెల రోజుల క్రితం అదే ప్రాంతంలోవుంటున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రకటించారు. త్వరలో అందరి బాగోతం బయటపెడతానని కూడా హెచ్చరించారు. రోజులు నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ భాగోతమేదో బయటపెట్టక పోవడంతో లోలోపల ఏదో సెట్టింగులు జరిగిపోతున్నాయంటూ చర్చమొదలైంది. ఇలా ప్రభుత్వ లోపాలను, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పనులపై టిడిపి నాయకులు స్పందించడం లేదని, అటు టిడిపి నాయకులపై రాజకీయ ఆరోపణలు తప్ప గతంలో చేసిన, జరిగిన అక్రమాలపై వైసిపి నాయకులు కూడా నోరు మొదపడం లేదని జిల్లాలో చర్చ నడుస్తోంది.










