ప్రజాశక్తి-విజయనగరం : నేటి సమాజంపై మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, వాటి వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి సూచించారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. న్యాయ పరమైన అంశాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు మెగా న్యాయ అవగాహన శిబిరాలు పెడుతున్నామని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవా సదన్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన నల్సా తరహా మెగా న్యాయ అవగాహన శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగటం ద్వారా సమసమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి పట్ల అందరూ మానవతా దృక్ఫథంలో నడుచుకోవాలని, వారికి తోచిన సహాయం అందించాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన కేంద్రాలను ఆయన ప్రారంభించి పరిశీలించారు. పౌష్టిక విలువలతో కూడిన ఆహార పదార్థాలను పరిశీలించి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును, వైఎస్సార్ కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి పరికరాల అందజేత
గురుదేవా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సమకూర్చిన కృత్రిమ అవయవాలను ప్రత్యేక అవసరాలు కలిగిన పలువురికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి చేతుల మీదుగా అందజేశారు. ఆయనే స్వయంగా ప్రత్యేక అవసరాల గల వారి కాళ్లకు, చేతులకు అమర్చి సహకరించారు. కార్యక్రమంలో ఒకటో అదనపు కోర్టు జడ్జి జి. రజనీ, ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎం. మీనాదేవి, ఎస్సీ, ఎస్టీ సెల్ కోర్టు జడ్జి షేక్ సికిందర్ షా, సీనియర్ సివిల్ జడ్జి బి.హెచ్.వి. లక్ష్మీకుమారి, ఒకటో తరగతి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బి. రమ్య, మొబైల్ కోర్టు జడ్జి కె.ఎం. జమృత్ బేగం, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సిహెచ్. దామోదర్ రామ్మెహన్ రావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎడి జగదీష్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.










