
న్యూఢిల్లీ : తాజ్ మహాల్ నిర్మాణానికి సంబంధించి తప్పుగా చరిత్రలో నమోదైందని, వాటిని చరిత్ర పుస్తకాల నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తాజ్‌మహల్ చరిత్ర ఎలా వుందో అలాగే కొనసాగనివ్వండి అనిస్పష్టం చేసింది. గత రెండు మాసాల్లో ఈ తరహా పిటిషన్లు రెండు దాఖలయ్యాయి. అసలు ఇది ఏ తరహా పిల్ అనిజస్టిస్ ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన బెంచ్ పిటిషనర్‌ని ప్రశ్నించింది. ''పిల్స్ అనేవి విచారణ పేరుతో వేటాడేందుకు ఉద్దేశించినవి కావు. చరిత్రను తిరగరాయడానికి మేం ఇక్కడ లేం. చరిత్రను కొనసాగనివ్వండి, రిట్ పిటిషన్ తోసిపుచ్చుతున్నాం. ఎఎస్‌ఐకి అప్పీల్ చేసుకోవడానికి పిటిషనర్‌కి అనుమతినిచ్చాం. దీనిపై మాకెలాంటి అభ్యంతరాలు లేవు.'' అని బెంచ్ వ్యాఖ్యానించింది. అక్టోబరులో ఇటువంటి పిటిషన్‌నే సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తాజ్ మహల్ వాస్తవ చరిత్రను అధ్యయనం చేసేందుకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆ పిటిషన్ కోరింది. ఇవి 'పబ్లిసిటీ ఇంటరెస్ట్ లిటిగేషన్'గా తయారయ్యాయని వ్యాఖ్యానించింది. తాజ్ మహల్‌కి సంబంధించి తప్పుడు చారిత్రక అంశాలను తొలగించాలని కోరుతూ సుర్జిత్ సింగ్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వయసు ఎంతో తెలుసుకునేందుకు దర్యాప్తు జరపాలంటూ ఎఎస్‌ఐని ఈ పిటిషన్ కోరింది. ఈ ఏడాది మేలో బిజెపి నేత రజనీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో లక్నో బెంచ్ ముందు ఒక పిటిషన్ దాఖలు చేస్తూ, తాజ్‌మహల్‌లో మూసివును 22 గదులను తెరిచేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు.