ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : మారిన వాతావరణ పరిస్థితుల వల్ల వర్షపాతంలో సమతుల్యత లేకపోవడంతో ఖరీఫ్ పంటల సాగు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా కనీసం 3లక్షల ఎకరాల్లో కూడా పంటల సాగు కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ పంటలన్నీ కలిపి 48,578 ఎకరాల్లో వెనుకబాటు కనిపిస్తోంది. అత్యధికంగా వరి 28వేల ఎకరాలకుపైగా తగ్గింది. జిల్లాలోని సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే నేటికీ లక్ష ఎకరాలు వరకు సాగుకు నోచుకోలేదు. దీంతో, రైతుల్లో ఆందోళన మొదలైంది.
జిల్లాలో పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడంతో ఎక్కువ భాగం వర్షాధారంగానే సాగవుతుంది. జూన్ రెండోవారం నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న సంగతి తెలిసిందే. జూన్‌లో 52 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. జులైలో 82 మి.మీ వర్షం అధికంగా కురిసినప్పటికీ, ఆగస్టులో తిరిగి 24 మి.మీ. లోటులోకి వెళ్లింది. తిరిగి సెప్టెంబర్‌లో (గడిచిన ఐదు రోజుల్లో) అధిక వర్షపాతం నమోదైంది. వర్షపాత సమతుల్యత లేకపోవడం వల్ల వివిధ మండలాలు, ఆయా మండలాల్లోని గ్రామాల మధ్య వర్షపాతం హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీంతో, ఈ మేరకు మండలాలు, గ్రామాల మధ్య పంటల సాగు విస్తీర్ణంలో కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, వేరుశనగ, పెసలు, మినుములు, తదితర అపరాల పంటలన్నీ కలుపుకుని ఈ ఏడాది 3,13,465 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు కేవలం 2,08,407 ఎకరాల్లో మాత్రమే సాగు కనిపిస్తోంది. దీన్నిబట్టి 94,195 ఎకరాల్లో వెనుకబాటు ఉన్నట్టు స్పష్టమౌతోంది. గత ఏడాది ఇదే తేదీ (సెప్టెంబర్ 5) నాటికి 2,56,985 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన వివిధ పంటల సాగు 48,578 ఎకరాల మేర వ్యత్యాసం కనిపిస్తోంది. ఇందులోనూ అత్యధికంగా వరి 27,770 ఎకరాల్లో ఉబాలు తగ్గినట్టు స్పష్టమౌతోంది. మొక్కజొన్న 7,690ఎకరాలు, నువ్వులు 7,610 ఎకరాలు, పత్తి 1,155 ఎకరాలు, చెరకు 1,189 ఎకరాలు, చివరకు ప్రభుత్వం అత్యంత ప్రోత్సాహం ఇస్తున్నట్టు చెబుతున్న చిరుధాన్యాల సాగు కూడా 3,543ఎకరాల్లో తక్కువగానే ఉంది.
చాలీచాలని రైన్‌గేజ్ స్టేషన్లు
జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ రైన్‌గేజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటితోపాటు కొన్ని మండలాల్లో 37 అటోమేటిక్ రైన్‌గేజ్, 52 ఆటోమేటిక్ వెదర్ గేజ్ స్టేషన్లు ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఇవి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రెండు గ్రామాలు, లేదా పొలాల మధ్య కూడా వర్షపడడం, పడకపోవడం వంటివి చూస్తున్నాం. అలాగే ఒక్కోచోట కుండపోత వర్షాలు, దానికి కొద్ది దూరంలోనే మండుటెండలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో పరిమితమైన రైన్‌గేజ్, వెదర్ గేజ్ స్టేషన్ల వర్షాపాత సమతుల్యతను లెక్కించడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో 2018లో జిల్లాలోని వర్షపాతంపై పరిశోధనలు చేసిన శాస్త్ర వేత్తలు రెండు లేదా మూడు రెవెన్యూ గ్రామాల మధ్య ఒక రైన్‌గేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సూచించినట్టు సమాచారం.










