Sep 07,2023 21:47

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌

ప్రజాశక్తి-విజయనగరం :  లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌ ఆదేశించారు. 2023-24 సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఏర్పాట్లు, సన్నద్థతపై గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను సరిదిద్ధుకొని ఈ ఏడాది మరింత మెరుగ్గా ప్రక్రియను నిర్వహించాలని జెసి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఏడాది 4.37 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాలను చేరుకునేందుకు సమష్టి కృషి చేయాలని చెప్పారు. ఈ ఏడాది ప్రక్రియలో ఆర్‌డిఒలు భాగస్వామ్యం అవుతున్నారని, డివిజన్‌ పరిధిలో సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకోవటంలో ఆర్‌డిఒలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు, క్యాంపులు నిర్వహించా లని చెప్పారు. రైతులకు అన్ని విషయాలపైనా పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కొనుగోలు జరిగే సమయంలో జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సందర్శనలు, అవగాహన శిబిరాలు పెట్టాలని నిర్దేశించారు.
ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్‌ తప్పనిసరి
నూతన విధివిధానాలు, నిబంధనల మేరకు ధాన్యం తరలించే వాహనాలకు తప్పకుండా జిపిఎస్‌ అనుసంధానం చేయాల్సి ఉంటుందని జెసి చెప్పారు. దీనికి సంబంధించిన ఖర్చును వాహనదారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హమాలీల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
క్వింటాకు రూ.143 పెరిగిన మద్దతు ధర
గత సీజన్‌ కంటే 2023-24 సీజన్‌లో సాధారణ, ఎ- గ్రేడ్‌ ధాన్యం రకాలకు క్వింటాకు రూ.143 పెరిగిందని సివిల్‌ సప్లై డిఎం తెలిపారు. గత ఏడాది సాధారణ రకం క్వింటా ధాన్యం రూ.2,040 ఉండగా ఈ ఏడాది రూ. 2,183కి పెరిగిందని చెప్పారు. ఎ- గ్రేడ్‌ రకం క్వింటా గత ఏడాది రూ.2,060 ఉండగా ఈ ఏడాది రూ.2,203కి పెరిగిందని వివరించారు. సమావేశంలో ఆర్‌డిఒలు సూర్యకళ, శేష శైలజ, సివిల్‌ సప్లై డిఎం మీనాకుమారి, డిఎస్‌ఒ మధుసూదన రావు, మార్కెటింగ్‌, మార్క్‌ ఫెడ్‌, వ్యవసాయ, ఉద్యాన, సహకార సంఘం, రవాణా శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులు, ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.