ప్రజాశక్తి-రామభద్రపురం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శ్రీవెంకటేశ్వర కళాశాల ప్రాంగణంలో సిఐటియు విస్తృత స్థాయి సమావేశాన్ని మండల కార్యదర్శి బలసా శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపై తీవ్రమైన భారాలను మోపుతుం దన్నారు. కంపెనీలో సంఘం పెట్టుకొనే అవకాశం లేకుండా, కార్మిక సమస్యలపై పోరాటాలు చేయకుండా కార్మిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు కార్మికులకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చే విధానా లను తీసుకొస్తే భవిష్యత్తులో అదే కార్మికులు ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు అండగా సిఐటియు పోరాటం సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గోపాలం, సురేష్, తదితరులు పాల్గొన్నారు.










