ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వ్యవసాయ కార్మిక సంఘం పూర్వ నాయకులు ఆర్.కుప్పానాయుడు స్ఫూర్తితో రాష్ట్రంలో అసైన్డ్ భూముల రక్షణకు ఉద్యమిద్దామని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.వెంకన్న పిలుపునిచ్చారు. ఆర్.కుప్పానాయుడు 11 వర్థంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో వ్యకాస ఆధ్వర్యంలో అసైన్డ్ భూముల చట్ట సవరణ-దుష్ఫలితాలు అనే అంశంపై కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ రాకోటి ఆనంద్ అధ్యక్షతన సదస్సు ఏర్పాటు చేశారు. ముందుగా కుప్పా నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పానాయుడు వైద్యవిద్య పూర్తి చేసినా పేదల, గిరిజనుల కోసం జీవితాంతం పోరాటం చేశారని తెలిపారు. ఆర్థికంగా పేదలు అభివృద్ధి చెందినప్పుడు అసమానతలు లేని సమాజం ఏర్పడుతుందని పోరాడిన వ్యక్తి కుప్పానాయుడు అన్నారు. స్వాతంత్య్రం అనంతరం దళిత, గిరిజనులకు శాశ్వత హక్కు ప్రాతిపదికన అసైన్డ్ భూములు పంపిణీ చేశారని తెలిపారు. పేదలకు ఇచ్చిన భూములు కొనడానికి, అమ్మడానికి వీల్లేకుండా చట్టం చేశారని గుర్తుచేశారు. ఆ భూముల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనేరు రంగారావు కమిటీని ఏర్పాటు చేస్తే, అసైన్డ్ భూముల రక్షణకు కమిటీ కొన్ని సూచనలు చేసిందన్నారుక. తర్వాత వచ్చిన చంద్రబాబు, నేడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయడం లేదన్నారు. మరో వైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో కమిటీ వేసి రానున్న కాలంలో అసైన్డ్ భూములు దళితులు, గిరిజనుల చేతుల్లో లేకుండా చేస్తున్నారన్నారు. ఈ భూములను కాపాడుకోవడం కోసం అసైన్డ్ భూముల చట్టంలో తీసుకొచ్చిన మార్పులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, డప్పు కళాకారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆర్.రాములు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.సోములు మాట్లాడుతూ కుప్పానాయుడు సేవలను స్మరించుకున్నారు.
గజపతినగరం : కుప్పానాయుడు వర్థంతిని పురస్కరించుకొని కౌలురైతు సంఘం నాయకులు రాకోటి రాములు ఆధ్వర్యంలో పురిటిపెంటలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాకోటి రాములు మాట్లాడుతూ కుప్పానాయుడు ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, జెర్రీ రాము, తదితరులు పాల్గొన్నారు.










