ప్రజాశక్తి-విజయనగరం : ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా సంప్రదాయ కుల వృత్తులు, హస్తకళాకారులకు ఆర్థిక స్వావలంబన లభిస్తుందని.. అర్హులందరికీ ఫలాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లాలోని అర్హత కలిగిన వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన ఉపాధి పొందాలని కలెక్టర్ సూచించారు. గురువారం తన ఛాంబర్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పథకం అమలు, కలిగే ప్రయోజనాలు, అర్హుల గుర్తింపు, శిక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక సచివాలయాలు, కామన్ సర్వీస్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శ కాలను జారీ చేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. వీలైనంత మంది అర్హులను పథకంలో చేరేలా ప్రణాళికాయుత కృషి చేయాలని చెప్పారు. విశ్వకర్మ పథకం ప్రయోజనాలను, అర్హత ప్రమాణాలను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఆర్. పాపారావు కలెక్టర్‌కు వివరించారు. 18ఏళ్లునిండిన అర్హులని పేర్కొన్నారు. మొబైల్ ఫోనుకు లింకైన ఆధార్ కార్డు సాయంతో స్థానిక సచివాలయం లేదా కామన్ సర్వీసెస్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. కుటుంబం లో ఒక్కరికే అవకాశం ఉంటుందని అన్ని అర్హతలు ఉంటే విశ్వకర్మ సర్టిఫికేట్ అందజేస్తామని అలా పొందిన వారికి ఐదు రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో రూ.500 భతితో పాటు రూ.15,000 విలువ కలిగిన టూల్ కిట్ అందజేస్తా మని వివరించారు. ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రూ.1లక్ష బ్యాంకు లోను ఐదు శాతం వడ్డీపై పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన వారికి ఐదు శాతం వడ్డీపై రూ.2 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మొదటి విడత రుణం 18 నెలల్లో, రెండో విడత రుణం 30 నెలల్లో తీర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీ పథకాలు పొందిన వారు అనర్హులని స్పష్టం చేశారు.సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం ఆర్.పాపారావు, మెప్మా పీడీ సుధాకర్, జెడ్‌పి సిఇఒ రాజ్ కుమార్, డిపిఒ శ్రీధర్ రాజా, స్కిల్ డెవలపెట్ అధికారి గోవిందరావు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్‌డిఎ, మత్య్సశాఖ, అధికారులు పాల్గొన్నారు.










