ప్రజాశక్తి-విజయనగరం కోట : కోడికత్తి కేసులో తెలుగుదేశం పార్టీ తనపై కుట్ర చేస్తున్నట్లు జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. శుక్రవారం అశోక్‌బంగ్లాలో విలేకర్లతో మాట్లాడుతూ కోడికత్తి కేసులో జెడ్‌పి చైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు చేసిన న్యాయవాది కోసం మాట్లాడటం మానేసి టిడిపని ఇందులోకి లాగడమేమిటని ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జంపల్లి శ్రీనివాసరావుకి ఎన్‌ఒసి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, ఓ దళిత యువకుడు నాలుగున్నర ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని గుర్తు చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న జగన్, అవినాష్ మాత్రం బెయిల్ మీద తిరుగుతున్నారని విమర్శించారు.కోడి కత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు న్యాయస్థానానికి వెళ్లడం లేదని ప్రశ్నించారు. కోడి కత్తి డ్రామా ఆడినది వైకాపాయేనని, దీన్ని తెదేపా మీద నెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసిపి పాలనతో ప్రజలంతా విసిగిపోయారని.. జగన్‌మోహన్‌రెడ్డిని ఎంత త్వరగా గద్దె దించాలో ఎదురు చూస్తున్నారని అన్నారు.ఉమ్మడి విజయనగరంలో సీట్లన్నీ తామే గెలుస్తామని వెల్లడించారు. సమావేశంలో పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు, బొద్దుల నర్సింగరావు, గంటా పోలినాయుడు, ఆల్తి బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు.










