ప్రజాశక్తి - గుర్ల : మండలంలో వర్షాభావ పరిస్థితులతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వరినారు వేసి నెల రోజులు కావస్తున్నా దమ్ములు కాక పోవడంతో ఈ ఖరీఫ్ సీజనకు వరి పంట పండే అవకాశాలు లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంజన్లతో నీరు తోడి కొంతమంది వరి నాట్లు వేశారు. ఈ విధంగా మండలంలో 40 శాతం వరినాట్లు వేసి నట్లు వ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు తెలిపారు. కాగా మండలంలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు గడిగెడ్డలో పూర్తిస్థాయిలో నీరు నిల్వ లేకపోవడంతో సాగునీరు అందక రైతులు వరినాట్లు వేయలేదు. గడిచిన పదిహేను రోజుల నుంచి గడిగెడ్డ కాలువలు ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కొంతమంది రైతులు కోరినా సకాలంలో నీరు విడుదల చేయ లేదు. దీంతో కుడి, ఎడమ కాలువలు కింద ఉన్నా కొంత మంది రైతులు, నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్ దృష్టికి తీసికెళ్లారు. దీంతో ఎట్టికేలకు ఈ నెల 23న జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నీటిని విడుదల చేశారు. గడిగెడ్డలో నీటి మట్టం నాలుగు అడుగులు ఉండడంతో శివారు ప్రాంతాల్లో ఉన్న రైతులకు సాగు నీరు అందని ద్రాక్షలా మారిందని శివారు భూములున్న రైతులు అంటున్నారు. కాలువల ద్వెరా నీరు వదిలినప్పటికి రెండు మూడు గ్రామాలకు తప్పా మిగిలిన గ్రామాలకు సాగు నీరు అందడం గగణమే. కుడి కాలువ కింద బూర్లిపేట, పకీరుకిట్టలి, పల్లిగండ్రేడు, కొండగండ్రేడు, గరికివలస, గజపతినగరం మండలం కెంగువ గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ఎడమ కాలువ ద్వారా తెట్టంగి, గూడెం, పాలవలస, పునపురెడ్డి పేట, కలవచర్ల గ్రామాలకు సాగునీరు అందాలి. గడిగెడ్డలో పూర్తి స్థాయి నీటిమట్టం14 అడుగులు. ప్రస్తుతం 4 అడుగులు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. గడిగెడ్డలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంటే 2900 ఎకరాలకు సాగునీరు అందుస్తుందని అధికారులు చెబుతున్నారు.
తోటపల్లిదీ అదే పరిస్థితి
వాస్తవానికి తోటపల్లి కాలువ నుంచి గడిగెడ్డకు నీరు వచ్చేది. దీంతో గడిగెడ్డ నీటి మట్టం పూర్తిగా ఉండేది. ఇప్పుడు తోటపల్లి కాలువ నుంచి నీరు గడిగెడ్డకు రాకపోవడం, తగినంతగా వర్షాలు కురవక పోవడం, గడిగెడ్డలో నీటినిల్వ పూర్తిస్థాయిలో లేదు. గడిచిన నాలుగు సంవత్సరాలు నుండి తోటపల్లి కాలువ నుండి గడిగెడ్డకు నీరు రాలేదు. రైతులపై ఎంతో సానుకులతతో ఉన్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు సభలు, సమావేశాలలో మైకు పట్టుకొని ప్రసంగాలను ఊదరగొడుతున్నా సాగునీటిని అందించే పరిస్థితి మాత్రం లేదు. తోటపల్లి నీరు విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల తీరు దొందూ దొందే అన్న చందంగా ఉంది. తోటపల్లి కాలువల్లో పిచ్చిమొక్కలు, చెత్తా చెదారం పేరుకపోవడం వల్ల సాగునీరు రావడం లేదు. తోటపల్లి నీరు తెచ్చి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామన్న నాయకుల మాటలు నీటిమూటల్లా మిగిలాయని మండలంలో రైతులు అంటున్నారు. ఈ సంవత్సరం తోటపల్లి, గడిగెడ్డల నుంచి సకాలంలో సాగునీరందకపోవడం, వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో కరువును ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు వాపోతున్నారు.










