Aug 30,2023 20:57

ధర్నా చేస్తున్న విఆర్‌ఎలు, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విఆర్‌ఎలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అక్రమంగా అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడటం ముఖ్యమంత్రికి న్యాయమా? అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ ప్రశ్నించారు. విఆర్‌ఎల అరెస్టులకు నిరసనగా బుధవారం కలెక్టరేట్‌ వద్ద విఆర్‌ఎల సంఘం ఆధ్వర్యాన ధర్నా చేశారు. అనంతరం సురేష్‌, విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు కె.గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విఆర్‌ఎల ఫైలుపైనే మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నాలుగేళ్లుగా మండల, జిల్లా కేంద్రాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు, పోరాటాలను నిర్వహిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం దారుణమన్నారు. విఆర్‌ఎల సమస్య పరిష్కార బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారని, ఆయన మూడు అడుగులు ముందుకు, అరడుగుల వెనక్కి అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ప్రభుత్వం విఆర్‌ఎల వేతనం రూ.26 వేలకు పెంచాలని, డిఎ, టిఎ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రసాద్‌, రాజు, రాంబాబు, ఆదినారాయణ, రాముళ్లప్పడు, పైడి రాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.