ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యాన సోమవారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఆర్‌సి పట్నాయిక్, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు మాట్లాడుతూ జూన్‌లో జరిగిన ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్‌కు విరుద్ధంగా జూలై,సెప్టెంబర్‌లోనూ ఉపాధ్యాయులను బదిలీలు చేయడం వల్ల పాఠశాలలలో సీనియారిటీ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. పారదర్శక విధానానికి తిలోదకాలు ఇవ్వడం విద్యారంగానికి మంచిది కాదని, తక్షణం సిఫార్సు బదిలీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో జిల్లా కోశాధికారి సిహెచ్ భాస్కరరావు, జిల్లా కార్యదర్శులు ఎన్ సత్యనారాయణ, సిహెచ్ తిరుపతి నాయుడు, జి.రాజారావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎ.శంకరరావు, రాష్ట్ర కౌన్సిలర్ కె.శ్రీనివాసరావు, కె. అప్పారావు , మాధవీ లత, జిల్లా సబ్ కమిటీ కన్వీనర్ పి.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










