ప్రజాశక్తి-కొత్తవలస : కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమిని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది గమనించిన కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు అడ్డుకున్నారు. కొద్ది కాలంగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రవేశ ద్వారం ఎడమ వైపు ఉన్న స్థలాన్ని ఆక్రమించడానికి చూస్తున్నారు. కళాశాల సెలవు రోజుల్లో ఆ స్థలంలో మట్టి, రాయి తరలించి చదును చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి వ్యాను, ఆటో అక్రమంగా పార్కింగ్ చేసి ఉన్నాయి. ప్రినిపల్, సిబ్బంది కలిసి అదే స్థలం నుంచి ప్రహరీ నిర్మాణానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ స్థలంలో గుడి కట్టబోతున్నామని, వారితో వాగ్వాదానికి దిగారు. పనులు అడ్డుకోవద్దని సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. పనులు చేపడితే కళాశాల మార్గాన్ని మూసేస్తామని బెదిరించారు. గతంలో కూడా ఇలాగే కళాశాల గేటుకు తాళం వేశామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్, తహశీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశౄమని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.










