Sep 05,2023 22:02

సమావేశంలో మాట్లాడతున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్య నారాయణ

ప్రజాశక్తి - రామభద్రపురం :  మండలంలోని కొండకెంగువ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కోటేశ్వరరావుపై కొంతమంది అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు విడనాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్య నారాయణ డిమాండ్‌ చేశారు. స్థానిక నాయకులు బలసా శ్రీనుతో కలిసి ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. నిబద్దతో పనిచేస్తూ ఉపాధి హామీ కూలీల మద్దతు ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పై స్థానిక ఎమ్మెల్యేకు తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ప్రతిపక్ష టిడిపి మద్దతు సర్పంచ్‌గా ఇతని భార్య ఉండటంతో గ్రామంలో పట్టు సాధించేందుకు ఆయనను పావుగా చేస్తూ అధికార పక్షం నేతలు చేస్తున్న వికృత క్రీడ అని, దీన్ని తమ పార్టీ తరుపున ఖండిస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ చేయకుండా ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం ఎమ్మెల్యే స్థాయికి తగదన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన తప్పుడు పనులకు సహకరించక పోవడం, ఉపాధి పనికి రాకుండా వాళ్లకు సంబంధించిన వ్యక్తులు పేర్లు మస్తర్లలో నమోదు చేయకపోవడం వల్లే ఈ రాజకీయ కక్షలు చేస్తున్నారని అన్నారు. విధులు సమర్థనీయంగా నిర్వహిస్తూ, ప్రజాదరణ ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌కి ఎటువంటి నష్టం జరిగినా సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి బలస శ్రీను, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలం, సిఐటియు నాయకులు సురేష్‌ పాల్గొన్నారు.