Aug 25,2023 20:04

బాధితురాలికి చెక్కు అందజేస్తున్న విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-దత్తిరాజేరు, విజయనగరం :  జిల్లాల్లో చేపట్టిన పర్యటనల సందర్భంగా పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తమ కుటుంబ దీనస్థితిని విన్నవించుకొన్న ఎందరో అభాగ్యులకు ఉదారంగా సహాయం అందించి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం విజయనగరం జిల్లా మెంటాడ మండల పర్యటన సందర్భంగా మానవతా హృదయంతో మరో మహిళకు ఆర్థిక సహాయం అందించారు. గరివిడి మండలం బిల్లలవలస పంచాయతీ కొండదాడి గ్రామానికి చెందిన కన్నూరు సరస్వతి(34) తల్లిదండ్రులు ఇద్దరూ కేన్సర్‌ వ్యాధితో మృతి చెందారు. ఆమెకు తన అనుకునే తోబుట్టువులు ఎవరూ లేరు. పైగా గత ఐదేళ్లుగా ఆమె కూడా గొంతు కేన్సర్‌తో బాధపడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతోంది. ఆమెకు ఎలాంటి జీవనాధారం లేకపోవడంతోపాటు ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా తయారై రోజు గడవడమే కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫించను పొందేందుకు నిబంధనల ప్రకారం అవకాశం లేకపోవడంతో తనకు ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం అందించి తనను ఆదుకోవాలని శుక్రవారం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని కోరింది. స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే రూ.3 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఆమెకు వెంటనే సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మిని ఆదేశించారు. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరుచేస్తూ రెవిన్యూ అధికారులు చెక్కును సిద్ధం చేసి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా శుక్రవారం సహాయం అందజేశారు.