ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష, కెజిబివిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం కలెక్టరేట్ వద్ద వేడుకోలు దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ఎపి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, సిఆర్‌ఎంటి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గురువులు మాట్లాడుతూ పాదయాత్రలో సిఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు అన్ని విభాగాల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మినిమం టైం స్కేల్ అమలు చేసి, వేతనాలు పెంచాలని కోరారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలని డిమాండ్‌చేశారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేయాలన్నారు. పనిభారం తగ్గించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అన్ని పోస్టులకు కచ్చితమైన జాబ్‌చార్ట్ ఇవ్వాలని, ప్రతి నెల ఒకటో తేదికి వేతనాలు చెల్లించాలని కోరారు. దీక్షకు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు జి.అప్పలసూరి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఆర్‌ఎంటి ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.లక్ష్మునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాసరావు, పలు యూనియన్ల నాయకులు బి.రవీంద్ర, ప్రమీల, పోలినాయుడు, గణేష్, ఎస్.రమాదేవి, శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










