ప్రజాశక్తి-విజయనగరం కోట : కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సంఘీభావంగా కాంగ్రెస్ నాయకులు గురువారం పాదయాత్ర చేపట్టారు. తోటపాలెంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన పాదయాత్ర ఆర్‌టిసి కాంప్లెక్సు మీదుగా బాలాజీ జంక్షన్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎఐసిసి సభ్యులు వి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన జూడో పాదయాత్ర నేటికీ ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ఈ యాత్ర వల్ల ఫలితంగా రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు చేకూరాయని తెలిపారు. 4వేల కిలోమీటర్లకు పైగా 145 రోజులు దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. డిసిసి అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు సుంకర సతీష్ మాట్లాడుతూ దేశంలో 26 పార్టీలతో ఇండియా కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని భావించిన బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితగా ఇండియా పేరును భారత్‌గా మార్చడానికి పన్నాగం పన్నుతోందని అన్నారు. జూడో యాత్రకు వస్త్ను ఆదరణను తట్టుకోలేకే రాహుల్‌గాంధీ పార్లమెంట్‌సభ్యత్వాన్నిరద్దు చేశారని, అయినా కోర్టులో న్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ రంగసంస్థలను అమ్మేసి,కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ ప్రజలపై భారాలు వేస్తున్న బిజెపిని రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మైనార్టీ సెల్ జమ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.










