ప్రజాశక్తి-శృంగవరపుకోట : చంద్రయాన్-3 విజయవంతం కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జయహో ఇండియా, కంగ్రాట్యులేషన్స్ ఇస్రో, కంగ్రాట్స్ ఇస్రో.. నినాదాలు మిన్నంటాయి. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీలు చేపట్టారు. ఆనంద సమయంలో స్వీట్లు పంచిపెట్టారు. పలు పాఠశాలలు, కళాశాలల్లో ఇస్రో, చంద్రయాన్ రాకెట్ ఆకారాల్లో నమూనాలను ప్రదర్శించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రయాన్-3 విజయవంతమైనందుకు గాను ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శృంగవరపుకోట పట్టణంలోని దేవి కూడలి వరకు త్రినేత్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జయహో ఇండియా, కంగ్రాట్యులేషన్ ఇస్రో.. అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.
బొబ్బిలి : చంద్రయాన్-3 విజయవంతం కావడం భారతదేశానికి గర్వకారణమని రోటరీ క్లబ్ అధ్యక్షులు జెసి రాజు అన్నారు. చంద్రయాన్ - 3 విజయవంతంతో పట్టణంలోని శ్వేతాచలపతి ఇంగ్లీషు మీడియం పాఠశాల వద్ద విద్యార్థులతో జాతీయ జెండాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి మంచి గుర్తింపు తెచ్చారన్నారు. సాంకేతిక నైపుణ్యంతో దేశం ముందుకు వెళ్లాలని కోరారు. గ్రీన్ బెల్ట్ సొసైటీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారతదేశానికి గర్వకారణమని గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్‌వి రమణమూర్తి, సభ్యులు కృష్ణదాసు అన్నారు.
చంద్రయాన్ ఆకృతిలో విద్యార్థులు
పూసపాటిరేగ : మండలంలోని పసుపాం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు చంద్రయాన్ రాకెట్ నమూనా ఆకృతిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు, సభ్యులందరికు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు ఆర్.నాగేశ్వర్రావు, ఉపాధ్యాయులు, పిఇటి పాల్గొన్నారు.
చంద్రయాన్ 3విజయం గర్వకారణం
చంద్రయాన్ 3 విజయవంతం కావడం భారతీయులు అందరికీ గర్వకారణమని ఎస్‌టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో చంద్రుని దక్షిణ భాగంలో కాలు మోపిన మొదటి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సాఫీగా చేరిన క్షణాలు మరపురానివని, ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. వైజ్ఞానిక రంగంలో అగ్రగామిగా నిరూపించిన చంద్రయాన్ 3 భారత్ శక్తి వంతమైన దేశంగా బలపడడానికి ముందడుగుగా పేర్కొన్నారు. ఇది భారత్‌కు పండుగ రోజుఅని తెలిపారు.
శాస్త్రవేత్తలకు అభినందనలు
ఇస్రో ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అవ్వడం మనందరికీ గర్వకారణమని జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. భారతదేశం పట్ల ప్రపంచం సగౌరవంగా తలెత్తి చూసి శుభ సమయం ఇదని పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన, ఇస్రో - ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.ఈ అపురూపమైన ఘనత మన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి నాంది పలకడం, మన రాష్ట్రానికి మరింత మధుర స్మతి అని పేర్కొన్నారు.










