ఎపి జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ శ్రీధర్
ప్రజాశక్తి -సీలేరు
సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్ మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ బి.శ్రీధర్ వెల్లడించారు. గురువారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ నాలుగో యూనిట్ మరమ్మతు పనులను అబిరామ ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అప్పగించామని తెలిపారు. నాలుగో యూనిట్ పూర్తిస్థాయిలో ఓపెన్ చేసి పరిశీలించగా యూనిట్లో ట్రస్ట్ బేరింగ్ ప్యాడ్స్, జనరేటర్ గైడ్ బేరింగ్ ప్యాడ్స్ మరమ్మతులు గురయ్యాయని గుర్తించామని చెప్పారు. పాత వాటిని మరమ్మతులు చేస్తే ఉపయోగపడతాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించి ఉపయోగపడన పక్షంలో వాటి స్థానంలో కొత్త ట్రస్ట్ బేరింగ్ ప్యాడ్స్‌ను అమర్చడానికి చర్యలు చేపడతామని వెల్లడించారు. యూనిట్ మరమ్మతులకు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. స్థానిక జల విద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నామన్నారు. డొంకరాయి రిజర్వాయర్లో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో అక్కడ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశామని చెప్పారు. పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్లు ద్వారా గ్రిడ్ ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి నిరాటకంగా కొనసాగుతుందని వెల్లడించారు.
డ్రాఫ్ట్ చూబ్ గేట్లు లీకేజీ నీరు వెళ్లకుండా చర్యలు
డ్రాఫ్ట్ చూబ్ గేట్లు ద్వారా లీకేజీ నీరు నాలుగో యూనిట్‌లోకి వెళ్ళకుండా నియంత్రించడానికి ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ బి.శ్రీధర్, ఈఈ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో గురువారం పనులు చేపట్టారు. నాలుగో యూనిట్ మరమ్మతులు చేపట్టాలంటే యూనిట్‌లోకి నీరు రాకుండా నియంత్రించవలసి ఉంది. ఇందులో భాగంగానే డ్రాఫ్ట్ చూబ్ గేట్లు ద్వారా లీకేజీ నీటిని అరికట్టే విధంగా అండర్ వాటర్ సర్వీస్ జాన్ పనులు అప్పగించారు. చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ సూచన మేరకు డ్రాఫ్ట్ చూబ్ గేట్లు కిందికి దింపడానికి జెన్కో ఇంజనీర్లు, కార్మికులు చర్యలు చేపట్టారు. దీంతో నాలుగో యూనిట్‌లోకి లీకేజీ నీరు వెళ్లకుండా నియంత్రించగలిగారు.










