లబ్ధిదారులకు సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 27వ డివిజన్ పరిధిలో జొన్నగుడ్డి ప్రాంతంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేపట్టారు. జొన్నగుడ్డి, స్టేడియంపేట, బిసి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా కుటుంబాల్లో పొందిన సంక్షేమ పథకాల లబ్ధిని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఆరా తీస్తూ, స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న చిన్నపాటి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










