Aug 19,2023 19:47

ధర్నా చేస్తున్న ఫ్యాప్టో ప్రతినిధులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిఒ 117ను రద్దు చేయాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యాన శనివారం స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఇటీవల బదిలీలు, ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయుల జీతాలు తక్షణమే చెల్లించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు. గడిచిన మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. పని సర్దుబాటును నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో జిల్లా ఉప ప్రధానకార్యదర్శి రమేష్‌చంద్ర పట్నాయక్‌ ఆధ్వర్యాన చేపట్టిన ధర్నాలో నాయకులు డి.ఈశ్వరరావు, సన్యాసిరాజు, వై.అప్పారావు, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, రమణ, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.