Sep 02,2023 18:46

స్కూలు గేమ్స్‌ కార్యదర్శి రమణతో చర్చిస్తున్న డిఇఒ లింగేశ్వరరెడ్డి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు విద్యా శాఖ పచ్చ జెండా ఊపింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ,ప్రైవేటు విద్యా సంస్థల్లో పాఠశాల స్థాయిలో క్రీడా పోటీలకు రంగం సిద్దమైంది. శనివారం జిల్లా విద్యా శాఖ అధికారి బి.లింగేశ్వర రెడ్డి, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి ఎల్‌ వి రమణతో క్రీడా పోటీలపై సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా లో గల మండల స్పోర్ట్స్‌, గేమ్స్‌ కోఆర్డినేటరులు, నియోజక వర్గ స్పోర్ట్స్‌ గేమ్స్‌ కోఆర్డినేటరులుగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వారి ఆదేశాలు మేరకు అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈనెల 1 నుండి 10 వరకు మండల స్థాయి క్రీడలకు ఎంపికలు చేపట్టాలని తెలిపారు. 11 నుంచి 20 వరకు నియోజకవర్గ స్థాయి క్రీడలకు, 21 నుంచి అక్టోబర్‌ 15వరకు జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికలు నిర్వహించాలని తెలిపారు. మండల, నియోజక వర్గ స్థాయిలో 9 క్రీడలు (కబడ్డీ , ఖోఖో , వాలీ బాల్‌ , బాల్‌ బ్యాడ్మింటన్‌ , బాడ్మింటన్‌ , త్రో బాల్‌ , టెన్నికాయిట్‌, యోగ అథ్లెటిక్స్‌) కు సంబంధించి సెలెక్షన్స్‌ నిర్వహించాలని తెలిపారు. మిగిలిన క్రీడలకు సంబంధించిన సెలెక్షన్స్‌ జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడా ఎంపికలు ,పోటీలు విజయవంతంగా నిర్వహించాలని, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని తెలిపారు.