ప్రజాశక్తి-విజయనగరం : జగనన్నకు చెబుదాం ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా పోలీసుశాఖ ప్రథమ స్థానంలో నిలిచిందని ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు అధికారులతో ర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ తీవ్రమైన నేరాలకు సంబంధించి గత అర్ధ సంవత్సరంలో నమోదై, దర్యాప్తు పెండింగు ఉన్న కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, కేసులు నమోదు చెయ్యాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధిగా తమ పరిధిలో పాఠశాలలు, కళాశాలలను సందర్శించి, విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు సైనేజస్ ఏర్పాటు చేయాలని, వాహన తనిఖీలు చేపట్టాలని కోరారు. గంజాయి సేవించే వారిపైన, గంజాయిని విక్రయించే చిన్న వ్యాపారులపైన, గంజాయి అక్రమ రవాణకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలు
'జగనన్నకు చెబుదాం' పోర్టల్ కు వచ్చే, ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించుటలో గత మూడునెలలుగా జిల్లా పోలీసుశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఎస్‌పి హర్షం వ్యక్తం చేశారు. ఈ పోర్టల్ పర్యవేక్షణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న డిసిఆర్‌బి ఎస్‌ఐ జి.బాలకృష్ణను 'బెస్ట్ పెర్ఫార్మర్'గా జిల్లా ఎస్‌పి ఎంపిక చేసి, జ్ఞాపికను బహూకరించారు. అదే విధంగా పోక్సో కేసుల్లో నిందితులకు 20సం. లకు పైబడి శిక్షలు విధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం.శంకరరావును, హత్య కేసుల్లో నిందితులు శిక్షింపబడడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటరు వి. రఘురామ్‌లను ఎస్‌పి అభినందించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










