ప్రజాశక్తి-విజయనగరం : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి 146 వినతులు అందాయి. రెవిన్యూ శాఖకు సంబంధించి 110, ఎపిఇపిడిసిఎల్ కు 1, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 10, జిల్లా పంచాయతీ అధికారికి 9, మున్సిపల్ శాఖకు 12, డిఆర్‌డిఎకు 17, గ్రామవార్డు సచివాలయ శాఖకు 3 వినతులు అందాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్(కె.ఆర్.ఆర్.సి) సూర్యనారాయణ, భూసేకరణ అధికారులు బి.సుదర్శన దొర, పద్మలత తదితరులు వినతుల స్వీకరించారు.
వివిధ వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చే వినతులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా పరిష్కరించిన వినతుల్లో అర్జీదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమైన వినతులపై జాయింట్ కలెక్టర్ సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయా వినతులను పరిష్కరించి నట్టు సంబంధిత ప్రభుత్వ శాఖలు తెలియజేసినప్పటికీ అర్జీదారులు మాత్రం వాటి పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు.










