ప్రజాశక్తి - నెల్లిమర్ల : నగర పంచాయతిలో జగనన్న ఇళ్లు నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖ పీడీ వి. శ్రీనివాసరావు సూచించారు. శనివారం హౌసింగ్ డే సందర్భంగా నగర పంచాయతి పరిధి జరజాపు పేటలో హౌసింగ్ అధికార్లు జగనన్న కాలనీ సందర్శించి ఇంటి నిర్మాణాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు నిర్మాణాలు జరపని అర్హులైన లబ్దిదార్లు ఇంటి నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలన్నారు. నిర్మాణాలు ప్రారంభించక పోతే రద్దు జరిగే అవకాశం ఉందన్నారు. కాగా నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులు కూడా చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు, హౌసింగ్ డిఇ జి.మురళీ మోహన్, నగర పంచాయతి మేనేజర్ టి.కె.వి. విశ్వేశ్వర రావు, హౌసింగ్ ఎఇ ఆర్.పవన్, నాయకులు నల్లి శ్రీను, తుమ్ము నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామంలో హౌసింగ్ డే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి లక్ష్మీ నారాయణ లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇంతవరకు పునాదులు తీయన వారి పట్టాలు రద్దు చేసి వేరే వారికి ఇచ్చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసన్నకుమార్, గృహ నిర్మాణ సంస్థ ఎఇ ఆదిలక్ష్మి, గ్రామ సర్పంచ్ బల్లెంకి లక్ష్మి, ఎంపిడిఒ బిఎస్కేఎన్ పట్నాయక్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.










