Sep 02,2023 22:07

ఈ తిప్పలు ఎన్నాళ్లో?

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  'వర్షం నిలకడగా కురవడం లేదు. కురిసినా నీరు నిలబడడం లేదు. అష్టకష్టాలతో ఒడిసిపట్టిన వర్షపునీటితో ఉబాలు పట్టి అతికష్టం మీద నాట్లు వేసినా నాట్లు వేసినా వాటిని బతికించుకునేందుకు నానా తంటాలు పడాల్సివస్తోంది.' ఇదీ జిల్లాలో మెజార్టీ ప్రజానీకం, ముఖ్యంగా రైతు కుటుంబాల నోట వినిపిస్తున్న మాట. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైనంత వర్షం కురిసినట్టుగా అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అంత వర్షం కురవలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన కాస్తంత వర్షాలకు తగ్గట్టు ఎండలు కూడా మండిపోతుండడంతో చెరువులు నిండలేదు. జలాశయాల్లోనూ సామర్థ్యానికి తగ్గట్టు నీరు లేదు. దీంతో, లక్ష్యానికి తగ్గట్టు వరి నాట్లు పడలేదు. జిల్లాలో సాధారణంగా జూన్‌ చివరి నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్నాళ్ల నుంచి రుతుపవనాలు ఆలస్యం కావడంతో జులై ఒకటి లేదా రెండో వారంలోనైనా నారు పోతలు మొదలయ్యేవి. ఈ ఏడాది అందుకనుగుణంగా వర్షాలు కురవడంతో వరినారు పోతలు, ఇతర పంటల సాగు ఒకింత ఉత్సాహంగానే మొదలైంది. జులై చివరి వారం నుంచీ పెద్దగా వర్షాలు లేకపోవడంతో అనుకున్న స్థాయిలో నాట్లు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎదిగిన వరినారును ముందు పెట్టుకుని వరుణుడి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంట వరి. ఖరీఫ్‌ సీజన్‌లో 2,25,637 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,28,750 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. గత ఏడాది ఇదే సరిగ్గా సమయానికి 1,77,500 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మొక్కజొన్న గత ఏడాది ఇదే సమయానికి సుమారు 30,500 ఎకరాల్లో సాగవ్వగా, ప్రస్తుతం 20,910 ఎకరాల్లో మాత్రమే సాగైంది. పత్తి గతేడాది 5వేల ఎకరాలు సాగు కాగా, ప్రస్తుతం 3,127 ఎకరాలకు మించి సాగవ్వలేదు. చెరకు, వేరుశనగ, నువ్వులు, ఇతర అపరాలు తదితర పంటలన్నింటి సాగులోనూ ఇదే రకమైన వెనుకబాటు కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో అన్ని పంటలు కలుపుకుని 3,17,052 ఎకరాల మేర సాగు విస్తీర్ణం కాగా, గత ఏడాది ఇదే సమయానికి 2,39,903 ఎకరాల్లో సాగు కనిపించింది. ఈ ఏడాది కేవం 1,85,755 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఈనేపథ్యంలో దశాబ్ధాల తరబడి పాలకుల నిర్లక్ష్యాన్ని చాలా మంది రైతులు గుర్తుచేస్తున్నారు. వాస్తవానికి మన జిల్లాలో సాగునీటి వనరులకు కొదవలేదు. అందుకు తగ్గట్టే వర్షపాతం కూడా నమోదవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం కన్నా 5 మిల్లీ మీటర్ల వర్షం అధికంగా కురిసింది. కానీ, ఈ నీరు చెరువులు, జలాశయాల్లోకి చేరేందుకు అనుగుణంగా కాలువలు లేవు. దీంతో, కొంతమేరకు వర్షపునీరు నదుల ద్వారా సముద్రం పాలవుతోంది. మరోవైపు ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోవడం వల్ల ఎండకు ఆవిరైపోతోంది. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యం వల్లే ఏటా ఉబాలు ఆలస్యం అవుతున్నాయని, దీనివల్ల దిగుబడి కూడా సరిగా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.