Sep 05,2023 21:51

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తున్న కలెక్టర్‌,మేయర్‌, డిఆర్‌ఒ, డిఇఒ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌:  మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం విద్యాశాఖ ఆధ్వర్యాన మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 71 మందికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ కె.నాగలక్ష్మి, నగరమేయర్‌ వి.విజయలక్ష్మి ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిత్వాన్ని వికశింపజేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలు ఎక్కువ సమయం బడిలోనే గడుపుతారని, వారిలో ప్రతిభ, నైపుణ్యం గుర్తించే అవకాశం ఉపాధ్యాయు లకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో దాగివున్న నైపుణ్యాన్ని గుర్తించి పదును పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ఉపాధ్యాయులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి, ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు, టీచర్స్‌ డే సందర్భంగా ప్రభుత్వం ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. వారి కృషి, అంకిత భావాన్ని ప్రశంసించారు. గత నాలుగేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో, ప్రభుత్వం అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవెన లాంటి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. విద్యార్థుల జీవితాలను సమున్నతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సాధ్యమవు తుందని అన్నారు. సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, డిఇఒ బి.లింగేశ్వరరెడ్డి ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేస్తూ ప్రశంసించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టు కున్నాయి. డిఆర్‌ఒ ఎం.గణపతి రావు, జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌ కుమార్‌, డిఇఒ బి.లింగేశ్వర రెడ్డి, డైట్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.టి. నాయుడు, ఉప విద్యాశాఖ అధికారులు బ్రహ్మాజీ, వాసుదేవరావు, విద్యాశాఖసిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.