ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : అంతా చిన్నసన్నకారు రైతులు.. అందులోనూ గిరిజనులు, దళితులు, ఆర్థికంగా వెనుకబడిన బిసి రైతులే ఎక్కువగా ఉన్నారు. బహుశా అందుకేనేమో ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఎమ్మెల్యేలు ఎందరు వచ్చినా వీరికి సాగునీరు అందించాల్సిన గర్ల గెడ్డ జలాశయం గురించి పట్టించుకోవడం లేదు. నిధులు కేటాయించకపోవడం, అతి కొద్దిపాటి ఫారెస్ట్ ల్యాండ్‌కు క్లియరెన్స్ రాలేదంటూ సాకులు చూపడం ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. దీంతో, పాతికేళ్లగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు కడగండ్లే మిగిలాయి. ఈనెల 25న సిఎం జగన్మోహన్‌రెడ్డి మెంటాడ మండలం వస్తున్న నేపథ్యంలో అసంపూర్తిగా వెక్కిరిస్తున్న జలాశయంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మెంటాడ మండలం రొంపల్లి పరిధిలో గుర్ల గెడ్డ జలాశయాన్ని 2000లో అప్పటి టిడిపి ప్రభుత్వం రూ.4.28కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. 2900 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది అప్పటి లక్ష్యం. వాస్తవానికి జలాశయం గట్టు పొడవు, ఎత్తు పెంచితే సుమారు 8వేల ఎకరాల వరకు సాగునీరు అందించవచ్చని ప్రజాధృక్కోణం గల సాగునీటి పారుదల శాఖ ఇంజినీర్లు అప్పట్లో చెప్పారు. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టు డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేసి తగిన నిధులు కేటాయించాలని అప్పట్లో సిపిఎం నాయకులు కీర్తిశేషులు ఆర్.కుప్పానాయుడు ఆధ్వర్యాన రైతులు పెద్దపోరాటమే చేశారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం 2,900 ఎకరాల ఆయుకట్టుకే పరిమితం చేసి పనులు ప్రారంభించింది. ప్రధాన గట్టును దాదాపు నిర్మించినప్పటికీ, కొండవరకు ఉన్న 150 మీటర్ల మేర గట్టును అటవీ శాఖ అనుమతులు లేవనే సాకుతో అసంపూర్తిగా వదిలేసింది. ఇప్పటికీ అటవీ శాఖ అనుమతులు లేవనే చెబుతున్నారు. మరోవైపు ఎడమ కాలువ ద్వారా నీటిని మళ్లించేందుకు జలాశయం నుంచి సుమారు కిలోమీటరు పొడవున అక్విడెక్టు నిర్మించారు. కుడికాలువ పనులు ఆదిలోనే హంసపాదులా నిలిచిపోయాయి. ఇదంతా 2004 ఎన్నికలకు ముందు మాట. ఆ తరువాత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడంతో అక్విడెక్టు మరమ్మతులకు గురైంది. రెండు చోట్ల పిల్లర్స్ కూడా విరిగిపోయాయి. అసంపూర్తిగా వున్న జలాశయ గట్టు యథాతధంగానే ఉంది. దీంతో, జలాశయం ద్వారా సాగునీరు అందని పరిస్థితి. జలాశయానికి పైనవున్న కొండకోనల నుంచి వచ్చిన నీరు గుర్లగెడ్డ ద్వారా చంపావతిలో కలిసిపోతుంది. ఈ సమస్యను సిపిఎం, ఎపి రైతు సంఘం మారిన ప్రతి ప్రభుత్వానికీ విన్నవించింది. స్థానికంగా అప్పటి రాష్ట్ర మంత్రి పడాల అరుణ మొదలుకుని తాడ్డి వెంకటరావు, బొత్స అప్పలనర్సయ్య, కెఎ నాయుడుల దృష్టికి తీసుకెళ్తునే ఉన్నారు. ఆయా సందర్భాల్లో ప్రజలకు హామీలు ఇవ్వడం, ఆ తరువాత ప్రభుత్వానికి లేఖలు రాయడం మినహా ఒత్తిడి చేయలేదు. దీంతో, ఈ సాగునీటి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఎన్నికల సమయాల్లో మాత్రం దీనిపై హామీలు గుప్పిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టు నిధులు కేటాయించకపోయినా సాగునీటి పారుదల శాఖ ద్వారా అప్పుడప్పుడు అంచనాలు తయారు చేయడం పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా ఇటీవల రూ.16కోట్ల అంచనా రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. సిఎం జిల్లా పర్యటన నేపథ్యంలో గుర్లగెడ్డ ప్రాజెక్టుపై స్పందిస్తారని ప్రాజెక్టు ఆయకట్టుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.










