ప్రజాశక్తి-బొబ్బిలి : ఐటిఐ కాలనీ సమీపంలో ఉన్న జగనన్న లేఅవుట్‌ను శుక్రవారం హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి బిఎం దివాన్ పరిశీలించారు. బొబ్బిలి లేఅవుట్‌ను వర్చువల్‌గా సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అప్పటికి జగనన్న లేఅవుట్లో మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు, హౌసింగ్ డిఇలు రత్నాకర్, అప్పయ్యకు సూచించారు. ఐటిఐ కాలనీ లేఅవుట్లో 200 ఇళ్లను సిద్ధం చేస్తున్నామని కమిషనర్ శ్రీనివాసరావు చెప్పారు. రోడ్లు, పైపులైన్ ఏర్పాటు కోసం రూ.27 లక్షలతో ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఆర్చి నిర్మాణానికి రూ.5.50 లక్షలు మంజూరు చేస్తామని ప్రత్యేక కార్యదర్శి దివాన్ తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పట్టణ ఎఇ ఎ.సూర్యనారాయణ పాల్గొన్నారు.
కమిషనర్ శ్రీనివాసరావుకు అభినందన
జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసిన మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావును హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి బిఎం దివాన్ అభినందించారు. జిల్లాలో బొబ్బిలి మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలపడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇళ్ల నిర్మాణాలపై టీమ్ వర్క్ చేయడంతో మంచి ఫలితాలు సాధించామని శ్రీనివాసరావు తెలిపారు.










