ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి నల్లబోయిన లలిత (54) సోమవారం తెల్లవారు జామున తమ నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. నిద్రలో ఉండగా గుండెపోటు వచ్చిన ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు హుటా హుటిన తిరుమల-మెడికవర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం ఇంట్లో సత్యనారాయణ వ్రతంతో పాటు మనుమడికి పేరు పెట్టే కార్యక్రమం నిర్వహించారు. రోజంతా సందడిగా గడిపిన ఆమె అంతలోనే కన్నుమూయడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమెకు భర్త విజరు కుమార్, కుమారుడు అఖిల్, కుమార్తె భావన ఉన్నారు. లలిత అనంతపురం జిల్లా నుంచి బదిలీపై 2019 నవంబర్ 3న విజయనగరం జిల్లా గ్రంథాయానికి కార్యదర్శిగా వచ్చారు. రెండేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. మృతదేహాన్ని స్వగ్రామం కర్నూలు జిల్లా గుత్తి మండలం పెరవలి గ్రామానికి తరలించారు. ఆమె మృతికి గ్రంథాలయ ఉద్యోగులు సంఘం అధ్యక్షులు రామభద్రరాజు, సిబ్బంది నివాళులర్పించారు.
అధికారుల నివాళి
గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్.లలిత మృతికి జిల్లా అధికారులు సంతాపం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ అనంతరం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తో పాటు జిల్లా అధికారులు లలిత మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిముషాలు పాటించారు. విధుల పట్ల ఎంతో బాధ్యతగా వుంటూ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో మంచి సంబంధాలు గల ఒక సన్నిహిత అధికారిని కోల్పోయామని పలువురు పేర్కొన్నారు.










