Aug 31,2023 21:24

నకిలీ పట్టాలపై నిలదీస్తున్న కౌన్సిలర్‌ శరత్‌

ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం గరం గరంగా జరిగింది. స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో గురువారం కౌన్సిల్‌ సాధారణ, అత్యవసర సమావేశం మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైసిపి కౌన్సిలర్లు ఇంటి గోవిందరావు, పి.ఉమాశంకర్‌, ఎస్‌.బాబు మాట్లాడుతూ కౌన్సిలర్లు పేరుతో మెప్మా ఉద్యోగులు డ్వాక్రా మహిళలు నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిలర్లకు ఇవ్వాలని చెప్పి అక్రమ వసూళ్లు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని టిపిఆర్‌ఒ జగన్మోహన్‌ హామీ ఇచ్చారు. అక్రమ కుళాయి కనెక్షన్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ఇంటి గోవిందరావు కోరగా ఇస్తామని డిఇ రవికుమార్‌ చెప్పారు. గత కౌన్సిల్‌ సమావేశంలో రెండు చెరువులు సుందరీకరణ వాయిదా వేయాలని కౌన్సిల్‌ సమావేశంలో వైసిపి కౌన్సిలర్లు కోరారని, ఆ తీర్మానాలు వాయిదా వేశారా లేదా అని టిడిపి కౌన్సిలర్‌ రాంబార్కి శరత్‌ ప్రశ్నించగా అభ్యంతరం చేసిన కౌన్సిల్‌ సభ్యులతో చర్చించామని మున్సిపల్‌ చైర్మన్‌ సావు మురళి అన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో అభ్యంతరం చేస్తే పర్సనల్‌గా చర్చించడం మీ పార్టీ విషయం కాదని శరత్‌ అన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో అజెండా ఆమోదం, తిరస్కరణ చేసినవి వివరాలతో నోటీసు బోర్డులో ఎందుకు పెట్టడం లేదని శరత్‌ కోరగా ఇకా నుంచి పెడతామని చైర్మన్‌ మురళి చెప్పారు. మార్కెట్‌ రోడ్డులో రోడ్డు వేసినప్పుడు కాలువలు కొట్టేశారని, కాలువలు నిర్మించాలని టిడిపి ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు కోరారు. గతంలో మున్సిపాలిటిలో 80 విద్యుత్‌ స్తంభాలు వేసేందుకు తీర్మానం చేశామని, అవి ఏ వార్డులో ఎన్ని వేశారో చెప్పాలని ఐదో వార్డు కౌన్సిలర్‌ వి.హైమావతి కోరారు. తమ వార్డులో విద్యుత్‌ స్తంభాలు వేయాలని కోరిన పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు నుంచి వసూళ్లు చేసిన డబ్బులతో మహిళా మార్ట్‌లు పెట్టడం సరికాదని ఆమె అన్నారు. అత్యవసర సమావేశంలో అజెండా మొత్తం వైసిపి వార్డులకు నిధులు కేటాయించారని, టిడిపి వార్డు ప్రజలు పన్నులు కట్టడం లేదా నిధులు కేటాయించడం లేదని శరత్‌ నిలదీశారు. టిడిపి వార్డులు పట్ల వివక్షత చూపడం అన్యాయమని ఆయన అన్నారు. మల్లమ్మపేటలో శ్మశానవాటికలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కౌన్సిలర్లు కె.రామారావు, తెంటు పార్వతి కోరారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఇందిరమ్మ కాలనీ నకిలీ పట్టాలపై వాడివేడిగా చర్చ
ఇందిరమ్మ కాలనీ నకిలీ పట్టాలపై కౌన్సిల్‌ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. నకిలీ పట్టాలతో గుటకాయ స్వాహా కథనం ప్రజాశక్తిలో రావడంతో కౌన్సిల్‌ సమావేశంలో నకిలీ పట్టాలపై చర్చ జరిగింది. ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని టిడిపి కౌన్సిలర్‌ రాంబార్కి శరత్‌ నిలదీశారు. గతంలో అక్రమంగా నిర్మిస్తున్న పూనాదులను జెసిబితో టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగులు తొలగిస్తే మరల నిర్మాణం చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నకిలీ పట్టాలు, అక్రమ పూనాదులు నిర్మాణంలో అధికార పార్టీ నేతలు అండతోనే జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయని, సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై టిపిఒ వరప్రసాద్‌ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలను జెసిబితో తొలగిస్తే సెలవు దినాలలో నిర్మిస్తున్నారని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ నకిలీ పట్టాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. నకిలీ పట్టాలను గుర్తించాల్సిన బాధ్యత, ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని చెప్పారు. లేఅవుట్‌ వేసినప్పుడు మున్సిపల్‌ రిజర్వ్‌ స్థలం కేటాయించి మున్సిపాలిటీకు అప్పగిస్తే ఆక్రమణకు గురికాకుండా కాపాడుతామన్నారు. నకిలీ పట్టాలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇళ్ల స్థలాల ఆక్రమణల వెనుక ఎమ్మెల్యే హస్తం
పట్టణ పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీ, అమ్మిగారి కోనేరు గట్టులపై జరుగుతున్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల వెనుక స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు హస్తం ఉందని ఎమ్మెల్యే అండదండలు చూసుకునే ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఇందిరమ్మ కాలలో బినామీ పట్టాలు ఉన్నాయని ఖాళీ స్థలాలలో విఆర్‌ఒల అండతో నకిలీ పట్టాలు సృష్టించి వాటిపై పునాదులు వేయించి లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్‌, రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి పట్టణంలో జరుగుతున్న భూ దందాలపై సమగ్ర విచారణ చేపట్టాలి లేనిపక్షంలో ఎమ్మెల్యే ఆఫీస్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.