Aug 24,2023 20:30

శృంగవరపుకోట.. నిరసన తెలుపుతున్న గ్రీన్‌ అంబాసిడర్లు

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  గ్రీన్‌అంబాసిడర్లకు జిఒ 680 ప్రకారం రూ.10వేలు జీతం ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఎపి గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన శృంగవరపుకోటలో గురువారం నిరసన చేపట్టారు. తొలుత పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి దేవి కూడలి వరకు సిఐటియు ఆధ్వర్యాన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌చేశారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని, గుర్తింపు కార్డు ఇవ్వాలని, బకాయి వేతనాలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. ప్రతి నెలా ఐదో తేదీకి కార్మికులకు జీతాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ ముత్యాలు, గ్రీన్‌ అంబాసిడర్ల సంఘం మండల అధ్యక్షులు ఎన్‌.చిన్నారావు, మండల కార్యదర్శి బి.గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.
రామభద్రపురం : గ్రామాల పరిశుభ్రతతోపాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతున్న గ్రీన్‌అంబాసిడర్లకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎంపిడిఒ రమామణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బలస శ్రీను మాట్లాడుతూ కార్మికులకు సుమారు ఏడాది నుంచి ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తోందని మండిపడ్డారు. సకాలంలో జీతాలు రాకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని చెప్పారు. ఇదే వ్యధతో ఇటీవల ఆరికతోటలో గ్రీన్‌అంబాసిడర్‌ మామిడి గౌరి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. గౌరి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, 2020లో ఇచ్చిన జిఒ 680 ప్రకారం రూ.10 వేల వేతనం ఇవ్వాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పోలిరాజు, పరమేష్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం : గ్రీన్‌ అంబాసిడర్లకు బకాయి వేతనాలు చెల్లించాలని, వేతనాల పెంపు జీవో అమలు చేయాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌కు సిఐటియు నాయకులు బి.సూర్యనారాయణ ఆధ్వర్యాన గ్రీన్‌ అంబాసిడర్లు గురువారం వినతి అందజేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్న పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు, గ్రీన్‌ గార్డు టైం స్కేలు వర్కర్లకు వెంటనే పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని కోరారు. కనీస వేతనాలు అమలు చేయాలని, టెండర్‌ విధానం రద్దు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బంగారి పైడిరాజు, నర్సయమ్మ, నర్సింగరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.