ప్రజాశక్తి-శృంగవరపు కోట : పంచాయతీ కార్మికులకు, గ్రీన్ అంబాసిడర్లకు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, హామీ మేరకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలని కోరుతూ గ్రీన్ అంబాసిడర్లు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడోరోజు శుక్రవారం కొనసాగాయి. చివరిరోజు పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యాన గ్రీన్‌అంబాసిడర్లు, పంచాయతీ కార్మికులు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ జిఒ నంబర్ 680 ప్రకారం స్వచ్ఛభారత్ కార్మికులకు రూ.పది వేలు జీతం చెల్లిస్తానని ఇచ్చిన హామీ అమలుచేయాలని డిమాండ్‌చేశారు. కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. గుర్తింపు కార్డు ఇవ్వాలని, బకాయి వేతనాలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. ప్రతి నెలా 5వ తేదీకల్లా కార్మికులకు జీతాలు చెల్లించాలన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్.ముత్యాలు, గ్రీన్ అంబాసిడర్ల సంఘం మండల అధ్యక్షులు ఎన్.చిన్నారావు, మండల కార్యదర్శి బి.గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.










