Aug 23,2023 22:29

శృంగవరపుకోటలో రాస్తారోకో చేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  గ్రీన్‌ అంబాసిడర్లు, పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు అనంతరం రమణ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును అన్ని పంచాయతీల్లో అమలు చేయాలని, కార్మికులందరినీ యథావిధిగా టెండర్‌తో నిమిత్తం లేకుండా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు అరికట్టాలన్నారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం 18 వేలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చెలికాని ముత్యాలు, కార్మికులు పొట్లూరి నాగరాజు, తొత్తడి సన్నిబాబు, చంద్రయ్య, కృష్ణ, భాస్కర్‌, దాసు, అబద్ధం, మురళి, తాత తదితరులు పాల్గొన్నారు.
జామి : తమ సమస్యలను పరిష్కరించాలని గ్రీన్‌ అంబాసిడర్లు, పంచాయతీ పారిశుధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యాన బుధవారం జామిలో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, దండి శ్రీనివాసరావు మాట్లాడుతూ 010 పద్దు కింద ట్రెజరీ ద్వారా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బోని నాగరాజు, బోని అప్పారావు, చిప్పాడ వెంకటరావు, ఎస్‌.రాము, కొన్న సింహాచలం తదితరులు పాల్గొన్నారు.