ప్రజాశక్తి - నెల్లిమర్ల : గ్రామాలాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పి సురేశ్ బాబు అన్నారు. గురువారం కొండవెలగాడ, చంద్రంపేట, చిన బూరాడ పేట, పారసాం గ్రామాల్లో నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, సిసి రోడ్లు, విజయనగరం నుంచి కొండవెలగాడ మీదుగా గజపతినగరానికి ఆర్‌టిసి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించడంతో బాటు ప్రభుత్వ సేవలు నేరుగా అందించడానికి సచివాలయం వ్యవస్థ, రైతులకు రైతు భరోసా కేంద్రాలు, వైద్య సేవలు కోసం గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా విజయనగరం నుంచి కొండ వెల గాడ మీదుగా గజపతినగరం ఆర్‌టిసి బస్సు వేశామన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న వైసిపి ప్రభుతానికి మరోసారి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు అందవరపు సూరిబాబు, ఆర్‌టిసి జోనల్ ఛైర్‌పర్సన్ గదల బంగారమ్మ, డిసిసిబి వైస్ ఛైర్మన్ చనమల్ల వెంకట రమణ, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, వైస్ ఎంపిపిలు సారికి వైకుంఠం నాయుడు, పతివాడ సత్యనారాయణ, నగర పంచాయతి వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు, నాయకులు మత్స సత్య నారాయణ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రేగాన శ్రీనివాస రావు, గుర్ల జెడ్‌పిటిసి శీర అప్పల నాయుడు, తుమ్మల పేట పిఎసిఎస్ అధ్యక్షులు కోట్ల పైడి నాయుడు, ఎంపిటిసి సంగం రెడ్డి జగన్నాధం, నాయకులు కర్రోతు వెంకట రమణ, బెల్లాన రామారావు తదితరులు పాల్గొన్నారు.
కాగితాపల్లిలో గడపగడపకు...
రేగిడి: మండలంలోని పారంపేట పంచాయతీ పరిధి కాగితాపల్లి గ్రామంలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై కరపత్రాలు అందించి అవగాహన కల్పించారు. ప్రజలకు ఏఏ పథకాలు అందుతున్నాయో ఎమ్మెల్యే స్వయంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ద్వేయమన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సచివాలయ, వాలంటీర్లు వ్యవస్థ దేశానికే ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి వావిలపల్లి జగన్మోహన్‌రావు, మండల వైసిపి నాయకులు, మండల సర్పంచులు ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.










