ప్రజాశక్తి-బాడంగి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. మండలంలోని ముగడ, ముగడ కాలనీల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం పర్యటించారు. గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరాతీశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. తాగునీటి కోసం గ్రామస్తులు తన దృష్టికి తేవడంతో సమస్యను పరిష్కరించామని చెప్పారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే వెంటనే సచివాలయ సిబ్బంది తగు చర్యలు తీసికోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు శంబంగి వేణుగోపాల్, తెంటు మధు, మరిపి శంకర్, జెడ్‌పిటిసి రామారావు, యామలి శివప్రసాద్, తెర్లి నాగభూషణ, తదితరులు పాల్గొన్నారు.
సిఎం సహాయనిధి చెక్కు అందజేత
తెర్లాం : మండలంలోని బూరిపేట గ్రామానికి చెందిన టి.సాంబారావు కుమార్తె కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సిఎం సహాయనిధికి దరఖాస్తు చేయగా రూ.2 లక్షలు మంజూరయ్యాయి. రామభద్రపురం మండలంలోని కొండకెంగువ గ్రామానికి చెందిన కోట షణ్ముఖసాయి తేజకి రూ.1.20 లక్షలు మంజూరయ్యాయి. వారికి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి బెల్లాన ప్రసాద్, బూరిపేట సర్పంచ్ బూరి మధు పాల్గొన్నారు.
లారీ పరిశ్రమకు స్థలం కేటాయించాలి
బొబ్బిలి : స్థానిక గ్రోత్ సెంటర్లో లారీ పరిశ్రమ యూనిట్‌కు స్థలం కేటాయించాలని బొబ్బిలి లారీ ఓనర్స్, వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వేణుగోపాల్, జి.భాస్కరరావు.. ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి, పరిసర ప్రాంతాల్లో లారీలపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. గ్రోత్‌సెంటర్లో లారీ పరిశ్రమ యూనిట్ల ఏర్పాటుకు స్థలం కేటాయిస్తే మరికొంతమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శంబంగిని సన్మానించారు.










