ప్రజాశక్తి-డెంకాడ : మండలంలోని వెదుళ్లవలస పంచాయతీ మధుర గ్రామం గొడ్డుపాలెంలో గత ఐదు రోజుల నుంచి డయేరియా వ్యాపించి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సత్యారావు అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా ఐదుగురూ చికిత్స పొందుతున్నారు. గ్రామ సర్పంచ్ కలిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో అపారిశుధ్యాన్ని నిర్మూలించి కాలువల్లో నిల్వ ఉన్న నీటిలో బ్లీచింగ్ చేయించారు. అయినప్పటికీ డయేరియా విజృంభించి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఎఎన్‌ఎం ద్వారా మోపాడ పిహెచ్‌సికి సమాచారం అందించారు. దీంతో వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన మందులు ఇస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో కలిశెట్టి రామారావు, మామిడి సురేష్‌ను జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు.
పతివాడ రమణమ్మ, జయమ్మను గ్రామంలోనే ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో పతివాడ జయమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో డెంకాడ పిహెచ్‌సికి తరలించారు. పట్టా చందన ప్రియ అనే 9 ఏళ్ల పాప కూడా డయేరియాకు గురైంది. బాలికకు వైద్య సేవలందించడంతో కోలుకుంటోంది. అయితే గ్రామంలో అరకొర వైద్యమే అందిస్తున్నారని, పూర్తిస్థాయిలో సిబ్బంది గ్రామంలో పర్యటించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన సత్యారావు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు.
అయితే తమకు మోపాడ పిహెచ్‌సిలో వైద్య సేవలు వద్దని, డెంకాడ పిహెచ్‌సిలోనే సేవందించాలని బాధితులు కోరుతున్నారు. గ్రామం నుంచి మోపాడు వెళ్లేందుకు సుమారు 15 కిలోమీటర్లు దూరం ఉంటుందని, అంతదూరం ఎలా వెళ్లగలమని ప్రశ్నిస్తున్నారు.










