Aug 25,2023 20:06

కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సిఎం జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల సరిహద్దు గ్రామాల పరిధిలో 561.88 ఎకరాల్లో తలపెట్టిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు మెంటాడ మండలం చినమేడపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర విద్య, నైపుణ్యాభివద్ధిశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం, కేంద్ర మంత్రి ప్రసంగించారు. సిఎం మాట్లాడుతూ రూ.834 కోట్ల వ్యయంతో మూడేళ్లలో గిరిజన వర్శిటీ నిర్మాణ పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంజూరైన ఈ వర్శిటీ ఏర్పాటు గిరిజనుల జీవితాలను ములుపు తిప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ప్రపంచంలో గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడానికి, దోపిడీ నుంచి రక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కేవలం గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు, వైద్యారోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని పునరుద్ఘాటించారు. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మాణం జరుగుతోందని గుర్తుచేశారు. నామినేటెడ్‌ పదవులు, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు 50శాతం కేటాయించే విధంగా ప్రత్యేక చట్టం చేశామన్నారు. 500 జనాభా గల గిరిజన తండాలను 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామన్నారు. 1,53,820 గిరిజన కుటుంబాలకు 3,22,538 ఎకరాలను ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ డికెటి పట్టాలు తమ ప్రభుత్వం అందజేయడమే కాకుండా, వారికి రైతు భరోసాను సైతం వర్తింపజేశామని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఐదుగురు సభ్యులుండే ప్రత్యేక ఎస్‌టి కమిషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత తమదేనన్నారు.

 కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సిఎం జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌
 కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సిఎం జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌

క్రీడలు, నైపుణ్యాభివద్ధి, పరిశోధనల కేంద్రంగా సిటియు
అంతకుముందు సభలో కేంద్ర విద్యా నైపుణ్యాభివద్ధి శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీని క్రీడలు, నైపుణ్యాభివద్ధి, పరిశోధనల కేంద్రం గా తీర్చి దిద్ద నున్నామని చెప్పారు దేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా గిరిజనుల సంస్కతి సంప్రదాయాలు, జీవన విధానం మెరుగుపడతాయని అన్నారు. పక్కనే వున్న ఒడిశా కోరాపుట్‌ లో కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ రెండు యూనివర్సిటీలు పరస్పర సహకారంతో గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. చత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాల గిరిజన విద్యార్థులతో పాటు ఎపి విద్యార్ధులు ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించ వచ్చునని చెప్పారు. జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్రం లో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు భేషుగ్గా వున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఎపి విధానాలను ప్రశంసించారని చెప్పారు. ప్రాథమిక విద్యకు సంబంధించి మాతృభాష లో బోధన చేయడం భాషాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పని చేస్తున్నాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. సభలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ప్రసంగించారు. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్ససత్యనారాయణ, అరకు ఎంపి జి.మాధవి, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.