ప్రజాశక్తి-విజయనగరం కోట : గిరి పుత్రులను వైసిపి ప్రభుత్వం మభ్య పెడుతోందని విజయనగరం పార్లమెంట్‌స్థానం టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున విమర్శించారు. శనివారం ఆయన అశోక్‌బంగ్లాలో విలేకర్లతో మాట్లాడారు. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొత్తవలస మండలంలోని రెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని గిరి జన ప్రాంతానికి సమీపమైన అప్పన్నదొరపాలెం వద్ద భూమిని గుర్తించి, స్థల సేకరణ చేసి యూనివర్సిటీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిందని తెలిపారు. ప్రహారీగోడ కూడా నిర్మించిందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ నిర్మాణాన్ని పక్కనబెట్టి తీవ్రకాలయాపన చేసిందన్నారు. శంకస్థాపన చేసిన స్థలాన్ని కాదని మళ్లీ క్రొత్తగా వేరొకచోట శంకుస్థాపన చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. డాక్టర్ పివిజిరాజు పాచిపెంట వద్ద సుమారు 3వేలఎకరాలు భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం గతంలో ఇచ్చినప్పటికీ, రవాణా సౌకర్యాలు, విమానాశ్రయం వంటి సదుపాయాలు మెరుగ్గా ఉండే ప్రాంతం కావాలని తెలపడంతో, రెల్లి గ్రామం వద్ద టిడిపి ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. ఏ ఉద్దేశంతో వైసిపి ప్రభుత్వం స్థలం మార్పిడి చేసిందో అర్థం కావడం లేదన్నారు. నాలుగే ళ్లుగా నిర్మాణం చేసి ఉంటే నేడు విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేదని, కానీ ఈ ప్రభుత్వానికి యూనివర్సిటీ నిర్మాణం పట్ల, గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ది లేదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేయడం తప్పా ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏమీలేదన్నారు. గిరిజనుల పట్ల దొంగ ప్రేమను చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు తప్పకుండా బుద్ది చెబుతారని పేర్కొన్నారు.










