ప్రజాశక్తి - నెల్లిమర్ల : నగర పంచాయతి పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టారు. శనివారం నగర పంచాయతి పరిధి శెగిడి పేట 12, 13వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పి. సురేశ్ బాబు వార్డుల్లో పర్యటించి రూ.2లక్షలతో నిర్మించిన మంచి నీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనలో పలువురు స్థానికులు, టిడిపి కౌన్సిలర్ ముడు మంచి లక్ష్మీ, నాయకులు లక్ష్మణరావు ఆయా వార్డులో తాగు నీటి సౌకర్యాలు, సీసీ రోడ్లు, కాలువలు వేయాలని వినతి పత్రం అందజేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి 3సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు స్థలాలు చూపించ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు సంక్షేమ పథకాలు లెక్క చెబుతున్నారు గాని ఇళ్లు నిర్మించిన వారికి బిల్లులు చెల్లింపు జరగలేదని ఆరోపించారు. అనంతరం సమస్యలు విన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ సంబంధిత అధికార్లతో మాట్లాడి ఆయా సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతి ఛైర్‌పర్సన్ బంగారు సరోజినీ, వైస్ ఛైర్మన్‌లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, కో ఆప్షన్ సభ్యులు చిక్కాల సాంబశివరావు, నాయకులు గంటా అప్పల రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.










