May 11,2023 23:44

ధర్నా చేస్తున్న జిసిసి హమాలీలు

ప్రజాశక్తి - చింతూరు
2022 జనవరి నుండి ఇప్పటి వరకు జీసీసీ హమాలీలకు రావాల్సిన ఎరియర్స్‌ తక్షణమే చెల్లించాలని, జిఒఆర్‌టి నెంబర్‌-3ను తక్షణమే అమలు చేయాలని కోరుతూ చింతూరు జీసీసీ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిసిసి హమాలీలకు ఏడాదికి పైగా ఎరియర్స్‌ చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. గతేడాది వరదలు సమయంలో కష్టపడి పని చేసినందుకు జీసీసీ హమాలీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా చెల్లించలేదని, మరో నెలలో మళ్లీ వరదలు వచ్చే సమయం రానుందని, అయినా ఇంత వరకు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు చింతూరు మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్‌, జిసిసి హమాలీలు స్వామి, చిచ్చడి నాగు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.