ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వైద్యఆరోగ్య శాఖకు మూలస్థంబాలుగా పనిచేస్తున్న ఎఎన్‌ఎంలు తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఎపి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.జగన్మోహన్ తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతతో మాత్రమే ఉద్యోగాలు పొందిన వీరు నేడు వారి అర్హతకు మించిన బాధ్యతలను మోస్తున్నారని, వెంటనే పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎపిఎన్‌జిజిఒ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఎఎన్‌ఎంల జిల్లా సదస్సుతో ఆయన మాట్లాడారు. ఎఎన్‌ఎంలు రోజువారీ పనుల్లో భాగంగా దాదాపు 56 యాప్‌లను ఉపయోగించి సమాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సి వస్తోందన్నారు. ఫలితంగా తీవ్ర వత్తిడికి గురవడమే కాకుండా ఆరోగ్య పరమైన సమస్యలను సైతం ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే వారి సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. ఆ సంఘం జిల్లా కన్వీనర్ జివిఎస్‌ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో హెల్త్ సెక్రటరీస్ గ్రేడ్ 3 ఎఎన్‌ఎంల రాష్ట్ర అధ్యక్షులు ఎ. మాధవి, ఎపిఎన్‌జిజిఒ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వి.రమణ, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుక్కల సత్యనారాయణ, తదితరులు ప్రసంగించారు. అనంతరం జిల్లా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎ. మాధవి, ఉపాధ్యక్షులుగా జి.పైడిరాజు, కె.కళావతి, ఎం.పైడన్న, వెంకటేశ్వరరావు, రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా జి.వి.ఎస్.ఎన్. మూర్తి, కార్యదర్శులుగా భవాని, ఈశ్వరమ్మ, వెంకటలక్ష్మి, పి.వి.రమణ, పి.అన్నపూర్ణ, సూర్యకుమారి, కోశాధికారిగా ధనుంజరు ఎన్నికయ్యారు.










