Aug 26,2023 21:08

మరడాం సభలో సిఎం ప్రసంగిస్తుండగా పక్కనే నిలబడిన రాజన్నదొర

డిప్యూటీ సిఎం రాజన్నదొర రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పట్టణ నడిబొడ్డున నిర్వహించిన బహిరంగ సభకి, శుక్రవారం దత్తిరాజేరు మండలం మరడాం సమీపంలో జరిగిన గిరిజన యూనివర్సిటీ బహిరంగ సభకీ స్పష్టమైన తేడా కనిపించింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సిఎం రాజన్నదొర విషయంలో వైసిపి అధినేత, సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాటతీరులో అంత స్పష్టమైన తేడా కనిపించడానికి కారణాలేమిటనే చర్చ మొదలైంది.

ప్రజాశక్తి-సాలూరు: 
2019లో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పట్టణానికి వచ్చిన వైసిపి అధినేత జగన్‌మోహన్‌ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. పట్టణ నడిబొడ్డున నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి ఎమ్మెల్యే రాజన్నదొరను పక్కన నిలబెట్టుకున్న జగన్‌ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. గిరిజనుడైన రాజన్నదొర నీతిమంతుడని, రూ.30 కోట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినా పార్టీ ఫిరాయించలేదని కితాబిచ్చారు. పార్టీ ఫిరాయించిన బొబ్బిలి రాజు కన్నా దొర నిజాయతీపరుడని ప్రశంసించారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా రాజన్నదొరను గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాంటి ప్రశంసలందించిన జగన్‌.. శుక్రవారం దత్తిరాజేరు మండలం మరడాం సమీపంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన సభలో ఆయన గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క వరం కూడా ప్రకటించలేదు. సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడిన సమయంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర పక్కనే నిలబడ్డారు. జగన్‌ 35 నిమిషాల ప్రసంగంలో దొర గురించి ప్రస్తావించకపోవడం సరికొత్త చర్చకు తెరలేపింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సిఎం జగన్‌ డిప్యూటీ సిఎంగా రాజన్నదొర పనితీరు గురించి పల్లెత్తు మాట అనలేదు. 2024లో జరిగే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా మళ్లీ రాజన్నదొరని ఆశీర్వదించాలని చెప్పకపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలకు తావిస్తోంది.
ఇటీవల వైసిపి సోషల్‌ మీడియా గ్రూపుల్లో రాష్ట్రంలో దాదాపు 79 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా హల్‌చల్‌ చేసింది. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులందరూ 90 శాతం గెలుపు గుర్రాలేనన్న వాదనలు వినిపించాయి. ప్రస్తుత నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం నిశితంగా పరిశీలిస్తే రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అలాగైతే వైసిపి సోషల్‌ మీడియా గ్రూపుల్లో వచ్చిన తొలి విడత జాబితాలో రాజన్నదొరకూ చోటుదక్కాలి. కానీ అందులో దొరకు చోటుదక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పుష్పశ్రీవాణి పేర్లు ఆ జాబితాలో కనిపిస్తున్నాయి. తొలివిడత జాబితాలో చోటు దక్కకపోవడం, నిన్న మొన్నటి సిఎం జగన్‌ సభలో దొర ప్రస్తావన లేకపోవడం వంటి పరిణామాలు రాజన్నదొర భవితవ్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి.
సర్వేల్లో ప్రతికూల పవనాలే కారణమా?
వైసిపి అధిష్టానం సొంతంగా కొన్ని మీడియా సంస్థలతో రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేల్లో డిప్యూటీ సిఎం రాజన్నదొరకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే వాదనలు గుప్పుమన్నాయి. రోజూ స్థానికంగా ఉన్నప్పుడు ఉదయం 11 గంటల తర్వాతే ప్రజలకు అందుబాటులో ఉంటారని, నియోజకవర్గ పార్టీపై నియంత్రణ లేకపోవడం, మండలాలు, పట్టణంలో నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలను చక్కదిద్దడంలో వైఫల్యం, డిప్యూటీ సిఎం, మంత్రి హోదాలో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే రీతిలో వ్యవహరించకపోవడం, పూర్తిగా ఉమ్మడి జిల్లా అగ్రనేత కనుసన్నల్లో పని చేస్తుండడం వంటి అంశాలు పార్టీ అంతర్గత సర్వేల్లో ప్రతికూలతకు కారణాలనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ప్రధానంగా మున్సిపాలిటీలో పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతున్న తీరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారడం కూడా దొర నాయకత్వంపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది.
పుష్పశ్రీవాణికి ఆశీస్సులు
ఇటీవల కాలంలో కురుపాం నియోజకవర్గంలో సిఎం జగన్‌ పర్యటించారు. అక్కడ నిర్వహించిన సభలో సిఎం జగన్‌ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి గురించి ప్రస్తావిస్తూ ఆశీస్సులు అందించారు. రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పుష్పశ్రీవాణిని మళ్లీ గెలిపించాలని జగన్‌ కోరారు. కానీ సాలూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన సభలో మాత్రం రాజన్నదొర ఊసెత్తని పరిస్థితి కనిపించింది. అధికారపార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికలు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టవచ్చునని పలువురు భావిస్తున్నారు.
ఎమ్‌పిపై దొరకు ఆశలు
అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర గత ఎన్నికల నుంచి ఆశిస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని దొరపై ఒత్తిడి చేశారు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లోనూ వైసిపి ఎమ్‌పి సీటు కావాలనే కోరికని ఆయన కొంతమంది ముఖ్య నేతల వద్ద వ్యక్తం చేశారని సమాచారం. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్నదొర అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలపై కొంత అసంతృప్తితోనూ ఉన్నారు. గ్రూపు రాజకీయాలపై విసుగుతో ఎమ్‌పి అయితే కొంత ప్రశాంతత ఉంటుందని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం ఆయన సీనియారిటీని ఏవిధంగా వినియోగించుకుంటుందో వేచి చూడాలి.