ప్రజాశక్తి - డెంకాడ : మండలంలోని ఆదివారం గంటపాటు కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన వర్షం రెండు గంటల వరకు ఏకధాటిగా కురవడంతో నీరు ఎక్కడికక్కడ రోడ్లపై పొంగిపొర్లింది. మండలంలోని పెదతాడివాడ నుంచి నాతవలస వెళ్లే రహదారిలో వరకూ వర్షపు నీరు రోడ్లపై నుంచి పారింది. పెద్ద తాడివాడ సమీపంలో కొండలపై పడిన వర్షపు నీరు కిందకి రావడంతో కొండ బట్టీలు పొంగి పొర్లాయి. దీంతో ఆర్ అండ్ బి రోడ్లపై నుంచి నీరు పవహించింది. కల్వర్టులు చిన్నవి కావడంతో రోడ్లపై నుంచి వర్షపు నీరు పెద్దఎత్తున ప్రవహించింది. ఉడుకులపేట వద్ద రోడ్డుపై నుంచి నీరు ప్రవహించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై ప్రవహించిన నీరు తగ్గేవరకు చాలా మంది ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు. విజయనగరం నుంచి నాతవలస వెళ్లే రహదారులు కూడా కల్వర్టులు కుదించకపోవడంతో రోడ్లపై వర్షం నీరు ప్రవహిస్తుందని దీంతో ప్రయాణించడం కష్టంగా ఉందని ప్రయాణికులు వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారులు ఇప్పటికైనా స్పందించి రెండు వైపులా కొత్త కల్వర్టులు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.










