Aug 23,2023 21:22

టంగుటూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, డిఆర్‌ఒ గణపతిరావు

ప్రజాశక్తి-విజయనగరం :  దేశం కోసం పోరాటం చేసిన నాయకుల నుంచి స్ఫూర్తిని తీసుకొని వారు చూపిన మార్గాన్ని అనుసరించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది కలెక్టర్‌ నాగలక్ష్మి, డిఆర్‌ఒ గణపతి రావు, పలువురు జిల్లా అధికారులు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మద్రాసులో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటీష్‌వారిని ఎదురిస్తూ, తుపాకీకి ఎదురుగా నిలిచి, తన గుండె ను చూపిస్తూ దమ్ముంటే కాల్చండి అని నిలిచి, ఆంధ్రకేసరి అని పేరు పొందారని చెప్పారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించి, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించారని కొనియాడారు.
తాను ప్రకాశం జిల్లాలో సంయుక్త కలెక్టర్‌ గా పని చేసిన కాలం లో ప్రకాశం పంతులు గృహాన్ని సందర్శించి, వారి గహాన్ని మ్యూజియం గా మార్చాలని ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పనులు కూడా జరుగుతున్నాయని అందుకు సంతృప్తి గా ఉందని అన్నారు. డిఆర్‌ఒ గణపతి రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తన లాయర్‌ వృత్తిని, ఆస్తి ని వదులుకున్న దేశ భక్తుడని పేర్కొన్నారు.
టంగుటూరికి జెడ్‌పిలో ఘన నివాళి
టంగుటూరి ప్రకాశం పంతులుకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ మద్రాసులో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటీష్‌వారిని ఎదురిస్తూ, తుపాకీకి ఎదురుగా నిలిచి, ఆంధ్రకేసరి అని పేరు పొందారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాపోలీసు కార్యాలయంలో...
టంగుటూరి జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మ్‌డ్‌ రిజర్వు డిఎస్‌పి యూనివర్స్‌ హాజరైన ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఎన్‌.గోపాలనాయుడు, డిసిఆర్‌బి ఎస్‌ఐ ప్రభావతి, ఆర్‌ఎస్‌ఐలు, ఉద్యోగులు పాల్గొన్నారు.