Aug 24,2023 21:08

పార్వతీపురం: ర్యాలీ చేస్తున్న విద్యార్ధినులు

ఇస్రో పంపిన చంద్రయాన్‌ -3 విజయవంతం పట్ల జిల్లాలో పలుచోట్ల విద్యార్థులు హర్షం ప్రకటించారు. భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింప చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ప్రజాశక్తి - కురుపాం 

చంద్రయాన్‌ 3 విజయవంతమైన నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.ఉషారాణి ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది కలిసి శాస్త్ర వేత్తలను అభినందిస్తూ ఇస్రో ఆకారంలో తయారయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క సత్తాను చాటి విజయం సాధించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్‌ : చంద్రయాన్‌ 3 విజయవంతం కావడంతో స్థానిక లయన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు 150 అడుగుల జాతీయ జెండాను, చంద్రయాన్‌ 3 రాకెట్‌ నమూనాతో జైహౌ భారత్‌, భారత్‌ మాతాకీ జై అంటూ ప్రపంచంలోనే భారతదేశం గుర్తింపు తెచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలకు జేజేలు పలికి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ చంద్రునిపై పరిశోధనలకు చంద్రయాన్‌ చేసేవి ఆధునిక శాస్త్ర సాంకేతికతను మరింతగా అభివద్ధి చేయడానికి ఉపయోగపడటంలో సహకరిస్తుందనడంలో అతిశయోక్తి లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు తయారు చేసిన చంద్రయాన్‌ 3 రాకెట్‌ నమూనా పలువుర్ని ఆకట్టుకుంది. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : చంద్రయాన్‌ 3 విజయోత్సవం సందర్భంగా స్థానిక కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. చంద్రయాన్‌ 3 ప్రాజెక్టు పని చేసే తీరు, వాటి ఉపయోగాలు, భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. చంద్రుడుపై మొట్టమొదటిసారిగా భారతదేశ త్రివర్ణ పతాకం ఎగరడం గర్వకారణమని ప్రిన్సిపల్‌ సిహెచ్‌ శ్రీ రంజని అన్నారు. కార్యక్రమంలో, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
బలిజిపేట : మండలంలోని తుమరాడలో గల శ్రీ భారతి విద్యాసంస్థల్లో టిడిపి బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబీ నాయన సమక్షంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చంద్రయాన్‌ 3 సక్సెస్‌ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బేబినాయన మాట్లాడుతూ ఇస్రో సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుని ఇటువంటి విజయాలు మరి ఎన్నో ఇస్రో శాస్త్రవేత్తలు సాధించాలని కోరారు. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం బిసి సెల్‌ అధ్యక్షుడు బూరాడ రవి మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జగన్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది, టిడిపి నాయకులు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్‌ :చంద్రయాన్‌-3 విజయోత్సవాలు పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండా, చంద్రయాన్‌-3 రాకెట్‌ నమూనాలను ప్రదర్శించారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అలాగే స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మార్నింగ్‌ స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
గుమ్మలక్ష్మీపురం : ఇస్రో ప్రవేశ పెట్టిన చంద్రయాన్‌ -3 విజయవంతం కావడంతో జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్‌ తిరుమల సాయి హైస్కూల్‌ విద్యార్థులు త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. చంద్రయాన్‌-3తో భారతదేశం కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మారు మోగాయని అన్నారు. భారత సైంటిస్టులు మేధాశక్తిని కొనియాడారు.
సీతంపేట : స్థానిక భారతి ఇంటర్నేషన్‌ స్కూల్లో చంద్రయాన్‌ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఎస్‌ నవీన్‌ కుమార్‌ కేకు కట్‌ చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చందమామపై ల్యాండ్‌ అవ్వడం గొప్ప విషయమని, రానున్న రోజుల్లో మనుషులు కూడా చందమామపై అడుగుపెట్టే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళీమోహన్‌, మురళి, సురేష్‌ కుమార్‌, దివాకర్‌, వెంకటేశ్వరరావు, పార్వతి, అప్పలనాయుడు, మోహన్‌రావు పాల్గొన్నారు.