Sep 04,2023 21:23

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు

ప్రజాశక్తి-బొబ్బిలి :  టిడిపి అధినేత చంద్రబాబు కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. వైసిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు రూ.120 కోట్లు కుంభకోణం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. చంద్రబాబు కుంభకోణంపై పచ్చ మీడియాలో రాకపోవడం అన్యాయమన్నారు. డొల్ల కంపెనీల పేరుతో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిని చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎంత పదవీకాంక్షతో ఉన్నారో అర్థమవుతోందని చెప్పారు. టిడిపి నేతల మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు. చంద్రబాబును, టిడిపిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో టిడిపి తప్పుడు ప్రచారాలను నమ్మేవారని, నేడు అక్షరాస్యులు ఉన్నారని, ఆ పార్టీ కుయుక్తులను ఎవరూ విశ్వసించడం లేదని స్పష్టంచేశారు.
జమిలి ఎన్నికలు ఇప్పుడే రావు
జమిలి ఎన్నికలు ఇప్పుడే వస్తాయని అనుకోవడం లేదని ఎమ్మెల్యే శంబంగి అన్నారు. కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందాక జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయనతో వైసిపి మండల అధ్యక్షులు శంబంగి వేణుగోపాలనాయుడు, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ టి.దామోదర్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు బి.అప్పలనాయుడు ఉన్నారు.